ప్రకృతి పరవశించేలా..

ABN , First Publish Date - 2020-09-06T07:36:22+05:30 IST

పల్లెలు పరవశించేలా ప్రభుత్వం చేపట్టిన పల్లె పకృతి వనాల నిర్మాణం (పార్కులు) రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేగంగా సాగుతున్నాయి...

ప్రకృతి పరవశించేలా..

శరవేగంగా ‘పల్లె ప్రకృతి వనాల’ పనులు

జిల్లాలో 215 పంచాయతీల్లో స్థలాల గుర్తింపు

154 గ్రామాల్లో ఊపందుకున్న పనులు 

ప్రతి గ్రామంలో ఎకరం స్థలం సేకరణ 

ఒక్కో వనానికి రూ 5.50 లక్షల మంజూరు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పల్లెలు పరవశించేలా ప్రభుత్వం చేపట్టిన పల్లె పకృతి వనాల నిర్మాణం (పార్కులు) రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేగంగా సాగుతున్నాయి. పల్లె పకృతి వనంగా నామకరణం చేసిన రూరల్‌ పార్కులు గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు, విద్యార్థులకు ఎంతో అహ్లాదాన్ని పంచనుంది. జిల్లా పంచాయతీ శాఖ అధికారులు స్థలాల గుర్తింపును వేగవంతం చేయడంతో పాటు ఉపాధిహామీ అనుసంధానంగా పనులు కూడా ప్రారంభం అయ్యాయి. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా  ప్రస్తుతం 215 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. ఇందులో 154 గ్రామపంచాయతీల్లో పకృతి వనాల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 61 గ్రామాల్లో పనులు మొదలు కావాల్సి ఉంది. మరో 40 గ్రామాల్లో స్థలాలు గుర్తించాల్సి ఉంది. ప్రతి గ్రామంలో ఎకరం తక్కువ కాకుండా స్థలాన్ని సేకరించి పకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. పకృతి వనానికి ప్రభుత్వం రూ 5.50 లక్షల వరకు కేటాయించింది. ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో పకృతి వనాల నిర్మాణం పనులపై దృిష్టి పెట్టారు. 

ఫ ఆహ్లాదం.. ఆరోగ్యం..

పల్లెలో ఏర్పాటు అవుతున్న పకృతి వనాలతో  ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించనున్నాయి. ఓపెన్‌ జిమ్‌లు, వాకింగ్‌ ట్రాక్‌లు, కూర్చోవడానికి ఏర్పాట్లు, కుటుంబంతో వచ్చి కాలక్షేపంగా గడిపే విధంగా మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి అట వస్తువులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పల్లెల్లో పార్కులు, ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలువనున్నాయి. 

ఫ దసరా ఉత్సవాలు.. కార్తీక వనభోజనాలు 

పల్లె పకృతి వనంలోనే ఒక జమ్మిచెట్టును ఏర్పాటు చేయనున్నారు. దసరా ఉత్సవాలు జరపనున్నారు. ఉసిరి చెట్టు పెంచనున్నారు. కార్తీక వనభోజనాలు చేసుకునే అవకాశం కలగనుంది. వీటితో పాటు తెలుగు రాశులకు సంబంధించిన 12 రకాల చెట్లను కూడా అందులో పెంచుతున్నారు. 

పల్లె ప్రకృతి వనంతో ఆహ్లాదం

- మేడిపల్లి దేవానందం -సర్పంచ్‌, కోరుట్లపేట

మా ఊరిలో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులను నెల రోజుల్లో పూర్తి చేశాం. సుమారు 4 వేల పూల, పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటాం. చిన్నారులు, పెద్దలు పార్కులో వ్యాయామం చేయడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదం నెలకొంటుంది.

Updated Date - 2020-09-06T07:36:22+05:30 IST