కరోనా అలర్ట్ : మూడు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-03-15T12:42:38+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరాళనృత్యం చేస్తున్న కరోనాను అడ్డుకోవడానికి, అదుపులో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణ కోసం అన్ని

కరోనా అలర్ట్ : మూడు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరాళనృత్యం చేస్తున్న కరోనాను అడ్డుకోవడానికి, అదుపులో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణ కోసం అన్ని విద్యాసంస్థలను, మాల్స్‌ను మార్చి 31 వరకు మూసివేయాలని నిర్ణయం తీసకున్నది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, వైద్య కళాశాలల టీచింగ్‌ ఆస్పత్రుల్లో, గుర్తించిన కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలను మూసివేసినా ఇంటర్మీడియేట్‌, పదో తరగతి పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పలు చర్యలు చేపట్టింది. 

 50 పడకల ఐసోలేషన్‌ వార్డులు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పది పడకలతో, ప్రతిమ, చల్మెడ వైద్య కళాశాలల ఆస్పపత్రుల్లో యాభై పడకల ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు ఒక పల్మనాలజిస్టు, జనరల్‌ ఫిజీషియన్‌, హెడ్‌నర్సు, ఇతర అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇద్దరు ఫల్మనాలజిస్టులు ఉండగా జిల్లా టీబీ అధికారి కూడా పల్మనాలజీ వైద్యుడే. వీరితో పాటు జిల్లా కేంద్రంలో పది మంది ప్రైవేటు పల్మనాలజిస్టులు ఉన్నారు. వీరందరి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించారు. అవసరమైతే వీరి సేవలను కూడా వినియోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం. 

 విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి

ప్రైవేటు లాడ్జింగులు, హోటళ్ల వారితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుజాత సమావేశం నిర్వహించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి గదులను అద్దెకు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రం నుంచి ఎయిర్‌పోర్టులో వైద్య సేవలు అందించేందుకు ఒక ఫిజీషియన్‌తో పాటు ముగ్గురు పీహెచ్‌సీ డాక్టర్లను, ఇద్దరు మైక్రో బయాలజిస్టులను, ఒక హెడ్‌ నర్సును పంపించారు. 

బస్టాండ్లలో నియంత్రణ చర్యలు

నిరంతరం వేలాది మంది ప్రయాణం చేసే బస్టాండ్‌లలో కూడా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. బస్టాండ్లలోని కుర్చీలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు. బస్టాండ్‌ ప్రాంగణాలను వెంట వెంటనే శుభ్రపరుస్తున్నారు. బస్సుల్లో సీట్లను స్తంభాలను కూడా నిరంతరం తుడిచే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాళ్లలో ప్రదర్శనలు నిలిపివేశారు.


మాల్స్‌ను మూసి వేస్తున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులను మరింత మెరుగ్గా చేపడుతున్నారు. దుబాయి, గల్ఫ్‌ దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇటీవల వచ్చిన వారిని గమనించాలని సూచిస్తున్నారు. ఎవరికైనా అనుమానాలు వస్తే వైద్యాధికారులను సంప్రదించాలని ప్రైవేటు వైద్యులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వాప్తిని నిరోధించవచ్చని సూచిస్తున్నారు. పొరుగు జిల్లా అయిన మంచిర్యాలలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌కు పంపించారని వార్తలు రాగానే జిల్లాలో కూడా యంత్రాంగం అప్రమత్తమైంది.  

మాస్క్‌లు, సానిటైజర్ల కొరత: 

కరోనా భయంతో ప్రజలు మాస్క్‌లు, సానిటైజర్లు కొనుక్కోవడానికి సిద్ధపడడంతో మార్కెట్‌లో వాటికి కొరత ఏర్పడింది. సాధారణ సమయాల్లో అమ్మే ధరకు పది రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు రెట్టింపు నుంచి అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో అనివార్యంగా తాము రేట్లు పెంచాల్సి వస్తుందని, మార్కెట్‌లో మాత్రం ప్రజల ముందు తాము అధిక ధరలకు విక్రయించే దోషులుగా మిగిలిపోతున్నామని రిటైల్‌ మెడికల్‌ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సానిటైజర్లు, మాస్క్‌లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని కొన్ని షాపులయాజమానులకు 35వేల రూపాయల జరిమానా విధించడంతోపాటు కేసులు కూడా నమోదు చేయడంతో రిటైల్‌ వ్యాపారులు వాటిని అమ్మేందుకు  ముందుకు రావడం లేదు. 

 హెల్ప్‌లైన్‌: 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అవసరమున్నవారు 104 టోల్‌ఫ్రీ నంబర్‌కుగానీ, 98499-02501 నెంబర్‌కుగానీ ఫోన్‌ చేయవచ్చని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.   

=

Updated Date - 2020-03-15T12:42:38+05:30 IST