ముందస్తు చర్యలతో ముప్పు తప్పింది..

ABN , First Publish Date - 2020-08-18T11:11:57+05:30 IST

కరీంనగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో జిల్లాలో వారంరోజులుగా ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నా ప్రాణనష్టం వాటిల్లలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల

ముందస్తు చర్యలతో ముప్పు తప్పింది..

 వరద బాధితులకు అండగా ఉంటాం 

 మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో జిల్లాలో వారంరోజులుగా ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నా ప్రాణనష్టం వాటిల్లలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం ఆయన  నగరంలోని 16వ డివిజన్‌ పద్మనగర్‌ ఏరియాలోని లోతట్టు ప్రాంతాలను, వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలను, ఎల్‌ఎండీ ప్రాజెక్టును పరిశీలించారు. 

అనంతరం ఎస్సారెస్పీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఎండీలో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మిడ్‌ మానేరు పూర్తిస్థాయిలో నిండితే ఎల్‌ఎండీకి నీటిని వదిలే అవకాశం ఉంటుందని చెప్పారు.  ఎల్‌ఎండీ, మిడ్‌ మానేరులకు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున  దిగువ ప్రాంతాల ప్రజలు, మత్స్యకార్మికులను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. నగర రోడ్లపై నిలిచిపోయిన నీటిని ఎక్స్‌కావేటర్ల సహాయంతో బయటకు పంపించే చర్యలు చేపట్టారని తెలిపారు. కూలిపోయ దశలో ఉన్న ఇళ్లను గుర్తించి అందులో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 18 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు.  1300కుపైగా చెరువులు పూర్తిగా నిండాయని చెప్పారు. నగర శివారులో లే అవుట్‌ లేకుండా నిర్మించిన కొన్ని ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయిందని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహాయంతో వాటిని వెంటనే తొలగిస్తున్నామన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వర్షాలు, వరదలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. 

Updated Date - 2020-08-18T11:11:57+05:30 IST