-
-
Home » Telangana » Karimnagar » The second curfew in the district
-
గుంపులుగా వచ్చే వారిని నిరోధించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-03-24T11:38:06+05:30 IST
జిల్లాలో కర్ఫ్యూ రెండోరోజూ కొనసాగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోమవారం జిల్లాలో ప్రజలు ఇళ్ల నుంచి పెద్దగా ఎవరూ రాలేదు.

భగ్గుమన్న కూరగాయల ధరలు
రోడ్డెక్కిన పలు ఆటోలు సీజ్
120 పడకల ఐసోలేషన్ వార్డులు
30 ఐసీయూ పడకలు
మరిన్ని ఐసోలేషన్ వార్డుల కోసం హాస్టళ్లను పరిశీలించిన కలెక్టర్
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): జిల్లాలో కర్ఫ్యూ రెండోరోజూ కొనసాగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోమవారం జిల్లాలో ప్రజలు ఇళ్ల నుంచి పెద్దగా ఎవరూ రాలేదు. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేయడంతో చాలా మంది నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోళ్ల కోసం ఇళ్ల నుంచి ఒకరిద్దరు బయటకు వచ్చి సరుకులను కొనుగోలు చేశారు. పలువురు ఆయా గ్రామాలకు ద్విచక్ర వాహనాల ద్వారా వెళ్లారు. కిరాణ షాపులు, మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంకులు మినహా అన్ని రకాల దుకాణాలు మూసి ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలను కూడా మూసి వేశారు. జిల్లాలోని గోదావరిఖని ప్రాంతంలో గల బొగ్గు గనుల్లో ఉత్పత్తి కొనసాగింది. కార్మిక సంఘాల నాయకులు మాత్రం సింగరేణి కార్మికులకు కూడా సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు.
పెద్దపల్లి, రామగుండం, మంథని, సుల్తానాబాద్ పట్టణాల్లో, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, పాలకుర్తి, అంతర్గాం, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్ మండలాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నది. ఆదివారం జరిగినంతగా సోమవారం జనతా కర్ఫ్యూ కొనసాగక పోవడం గమనార్హం. పెద్దపల్లి పట్టణంలో పోలీసులు రోడ్డెక్కిన 35 ఆటోలు, రెండు కార్లను, పలు బైకులను సీజ్ చేశారు. ఆర్‌టీఏ కార్యాలయం ఆవరణంలో సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ట్రాలీ ఆటోలో 30 మందిని తీసుకు వస్తుండగా, దానిని అక్కడే నిలిపివేశారు. అందులో అంతా యువకులు, విద్యార్థులు ఉన్నారు. ఆ వాహనం గోదావరిఖనికి వెళ్తున్నది. పోలీసులు వారి పేర్లు, చిరునామాలు, సెల్ నంబర్లను రాసుకుని వదిలి పెట్టారు. హైదరాబాద్ నుంచి చాలా మంది కార్లలో తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. అలాంటి వాహనాలను పోలీసులు వదిలి పెట్టారు. జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు వచ్చే పోయే వాహనాలను తనిఖీ చేయడం ఆరంభించారు. ఆటోలను మాత్రం సీజ్ చేయగా, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మాత్రం వివరాలు సేకరించి వదిలి పెట్టారు.
కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్..
పాలకుర్తి పంచాయతీ పొలిమేరలో గ్రామంలోకి బయట వ్యక్తులు ఎవరూ రావద్దని, ఒక వేళ వచ్చినా రూ.500 జరిమానా విధిస్తామని అని బోర్డు పెట్టారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అలాగే సుల్తానాబాద్‌లోని టీబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. గోదావరిఖనికి చెందిన ఒక యువకుడు ఉపాధి కోసం ఖతర్ దేశం వెళ్లగా, అక్కడి నుంచి రెండు రోజుల క్రితం ఇండియాకు చేరుకున్నాడు. అతడు సోమవారం జిల్లాకు చేరుకుని మంథనిలో గల తన అత్తగారింటికి వస్తుండగా, ఆయన వస్తున్నాడని సమాచారం తెలుసుకున్న ఆ కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యక్తికి కాలనీలోకి రానివ్వబోమని వారు చెబుతున్నారు. ప్రస్తుతం సదరు యువకుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నది. ఎయిర్ పోర్టులో థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించిన అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
జిల్లాలో 120 పడకల ఐసోలేషన్ వార్డులు..
కరోనా ఉధృతి పెరిగితే వారిని ఐసోలేషన్‌లో పెట్టేందుకు వీలుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 120 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో 30 పడకలు ఐసీయూ సౌకర్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి ఆసుపత్రిలో 20 పడకలు, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకలు, సుల్తానాబాద్ టీబీ ఆసుపత్రిలో 40 పడకలు, సింరేణి ఆసుపత్రిలో 10 పడకలు, ఎన్టీపీసీ ఆసుపత్రిలో 10 పడకలు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లలో 20 పడకలను ఏర్పాటు చేశారు. అవసరమైతే ప్రభుత్వ గురుకుల, ఇతర వసతి గృహాల్లోనే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గర్రెపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ దేశాల నుంచి ఇప్పటి రకు జిల్లాకు 131 మంది రాగా వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు వారికి సూచించారు. వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వారంతా బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ల చేతులపై ముద్రలు వేశారు. ఎవరైనా బయటకు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
మెడికల్ షాప్ యజమానికి జరిమానా..
పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల మెడికల్ షాపులో 50 రూపాయలకు ఒక మాస్కును విక్రయించగా ఆ షాపుకు సంబంధిత అధికారులు 25 వేల రూపాయల జరిమానా విధించారు. నిత్యావసర వస్తు వులు, కూరగాయలను కూడా అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు అధికారులను కోరుతున్నారు. కిరాణ షాపులు, కూరగాయల దుకాణాలను తెరిచి ఉండడం వల్ల జనాలు రోడ్లపైకి వస్తున్నారని గమనించిన పోలీసులు మంగళవారం నుంచి వాటిని ఉదయం 6 గంటల నుంచి 11 వరకే తెరిచి ఉంచాలని, ఆ తర్వాత తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.