దూరాన్ని బట్టి ఇసుక ధర

ABN , First Publish Date - 2020-03-13T12:02:51+05:30 IST

వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఇసుక ధర వసూలుకు చర్యలు తీసుకోనున్నామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

దూరాన్ని బట్టి ఇసుక ధర

ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం మన ఇసుక వాహనం యాప్‌

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఇసుక ధర వసూలుకు చర్యలు తీసుకోనున్నామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. ఇసుక అవసరమైన వారు మన ఇసుక వాహనం యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి ఇసుక ట్రాక్టర్లు, ట్రేలర్లు, ట్యాంకర్లు కొనుగోలుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంట్రాక్టరే ధర నిర్ణయించుకుని ఇసుక పంపిణీ చేసే వారని అన్నారు. ఇక నుంచి సాధారణ ప్రజలు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనులకు దూరాన్ని బట్టి ధర నిర్ణయించి ఇసుక పంపిణీ చేపడుతామని తెలిపారు.. జిల్లాలో తణుగుల, చల్లూరు, వీణవంక, చేగుర్తి, లింగాపూర్‌, రామంచ, రేణికుంట, కొత్తపల్లి, బొమ్మకల్‌,  ఊటూరు, గన్నేరువరం, వెల్దిలలో ఉన్న ఇసుక రీచ్‌ల వద్ద నుంచి ఇసుక పంపిణీ జరుగుతుందని  అన్నారు.


రీచ్‌లు ఉన్న ప్రాంతాలలో ట్రాక్టర్లను ఇసుక పంపిణీ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించాలని అధికారులకు సూచించారు. వరుస క్రమంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా చేస్తామన్నారు. 0-10 కిలోమీటర్ల ఒక స్లాగ్‌గా గుర్తించామని ఆయన తెలిపారు. ఒక కిలోమీటర్లకు రూ. 75ల చొప్పున ట్రాక్టర్లకు చెల్లిస్తామని అన్నారు. 300 రూపాయలు లేబర్‌ చార్జీలు ఉంటుందన్నారు. 10కిలోమీటర్ల లోపు అయితే రూ. 1520లు, 15కిలోమీటర్ల లోపు అయితే రూ. 1895లను ప్రజలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పనులకు ఈజీఎస్‌కు రూ. 470లు, ఎన్‌ఆర్‌ఐజీఎస్‌ పనులకు రూ. 370 నిర్ణయించినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రజలు ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు.


స్థలాలు గుర్తించాలి..

గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులకు స్థలాలు గుర్తించాలనిఅధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు లేని పక్షంలో దాతల నుంచి స్థలాలు సేకరించి కొనుగోలు చేయాలన్నారు. దాతల నుంచి తీసుకున్న స్థలాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించాలని సూచించారు. గ్రామాలలో కంపోస్టు యార్డులు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. తడిచెత్తను కంపోస్టు యార్డుకు పంపించాలని చెప్పారు. పనికి రాని చెత్తను మాత్రమే డంపింగ్‌ యార్డుకు వెళ్లేలాచూడాలన్నారు. గ్రామాల్లో ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. మండల కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మించి వివరాలను బోర్డుపై రాయించాలని సూచించారు.


గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌ ట్రేలర్లు, ట్యాంకర్లను కొనుగోలుచేయాలన్నారు. ఇప్పటికే వర్క్‌షాపులకు ఆర్డర్లు ఇచ్చామని, వర్క్‌షాపుల దగ్గరి నుంచి వాటిని తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఆర్‌వో పవన్‌కుమార్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, బెన్‌ షాలోమ్‌, గనుల శాఖ ఏడీ వెంకటేశం, డీపీవో రఘువరన్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్‌ ఏఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T12:02:51+05:30 IST