హరితహారానికి సన్నద్ధం

ABN , First Publish Date - 2020-06-21T10:23:39+05:30 IST

నైరుతి పలకరించింది. ఆరో విడత హరితహారానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.

హరితహారానికి సన్నద్ధం

25న ఆరో విడత ప్రారంభం 

తొలిరోజు లక్ష మొక్కలతో మెగా ప్లాంటేషన్‌ ఏర్పాట్లు 

జిల్లాలో మొక్కలు నాటే లక్ష్యం 54 లక్షలు 

మియావాకీ ప్లాంటేషన్‌ కింద 1.83 లక్షల మొక్కలు  

255 నర్సరీల్లో 72.91 లక్షల మొక్కలు సిద్ధం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నైరుతి పలకరించింది. ఆరో విడత హరితహారానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నెల 25న లక్ష మొక్కలు ఒకే రోజు నాటి మెగా ప్లాంటేషన్‌కు శ్రీకారం చుట్టడానికి  అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో ఈ సారి హరిత లక్ష్యాన్ని తగ్గించారు. గతంలో 90 లక్షల నుంచి 1.49 కోట్ల వరకు మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ సారి మాత్రం ప్రత్యేక ప్రణాళికతో జిల్లాలో 54 లక్షల మొక్కలు నాటే లక్ష్యం నిర్దేశించారు.   మొక్కల లక్ష్యం తక్కువగా ఉందని కోటి మొక్కలకు పెంచుకోవాలని జిల్లా పరిషత్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆ మేరకు అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 54 లక్షల మొక్కలు నాటడానికి వివిధ శాఖల ద్వారా లక్ష్యాలను నిర్దేశించారు. ఉపాధిహామీ ద్వారా 39 లక్షల మొక్కలను నాటనున్నారు. గతేడాది 91 శాతం మొక్కలు బతికాయి. ఈ సారి నాటడంతోపాటు వాటిని సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.  


మానేరు వాగు తీరం వెంట మొక్కలు 

సిరిసిల్ల మానేరు వాగు వెంట ఎగువ మానేరు నుంచి మిడ్‌ మానేరు వరకు 64 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించారు. వాగు పరిధిలో గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలు ప్రధానంగా రానున్నాయి. గతేడాది 47 కిలో మీటర్ల మేరకు 80,555 మొక్కలు నాటారు. ఈ సారి 35 కిలోమీటర్ల పరిధిలో 64 వేల మొక్కలు నాటనున్నారు. గంభీరావుపేట పరిధిలో 4,200, ముస్తాబాద్‌ 19 వేలు, తంగళ్లపల్లి  17,800, ఎల్లారెడ్డిపేట పరిధిలో 2,300  మొక్కలు నాటనున్నారు. 


మియావాకి ప్లాంటేషన్‌ 

మియావాకి ప్లాంటేషన్‌ కింద జిల్లాలో 12 మండలాల్లోని 73 గ్రామాల్లో ఈజీఎస్‌ ద్వారా హరితవనాలను పెంచనున్నారు. 29 పని ప్రదేశాలు, కమ్యూనిటీలో 14 పని ప్రదేశాల్లో 1.83 లక్షల మొక్కలు నాటనున్నారు. 


255 నర్సరీల్లో 72.91 లక్షల మొక్కలు సిద్ధం

జిల్లాలో హరితహారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లోనే మొక్కలు అందుబాటులో ఉండడానికి నర్సరీలను ఏర్పాటు చేశారు.   255 నర్సరీల్లో 72.91 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. బోయినపల్లి మండలంలోని నర్సరీల్లో 4.30 లక్షలు, చందుర్తి 8.11 లక్షలు, ఇల్లంతకుంట 10.55 లక్షలు, గంభీరావుపేట 6.02 లక్షలు, కోనరావుపేట  9.54 లక్షలు, ముస్తాబాద్‌ 10.20 లక్షలు, రుద్రంగి 1.69 లక్షలు, తంగళ్లపల్లి 7.82 లక్షలు, వీర్నపల్లి 2.84 లక్షలు, వేములవాడ అర్భన్‌ 1.09 లక్షలు, వేములవాడ రూరల్‌ 4.03 లక్షలు, ఎల్లారెడ్డిపేట 6.72 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. హరితహారాన్ని విజయవంతం చేయడానికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-06-21T10:23:39+05:30 IST