అమ్మో హైదరాబాద్‌..!

ABN , First Publish Date - 2020-06-22T10:40:23+05:30 IST

జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులు హైదరాబాద్‌ కాంటాక్టుల వల్లనే పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.

అమ్మో హైదరాబాద్‌..!

అక్కడి కాంటాక్టుల వల్లనే జిల్లా వాసులకు కరోనా

తాజాగా మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ

జిల్లాలో 19కి పెరిగిన కేసుల సంఖ్య

ర్యాండమ్‌ టెస్టులను ప్రోత్సహించాలి

ప్రజలను మరింత అప్రమత్తం చేయాలి


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులు హైదరాబాద్‌ కాంటాక్టుల వల్లనే పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన నాలుగైదు రోజుల్లో 11 మంది కరోనా వైరస్‌ బారినపడగా, ఇందులో ఒకరు మృతిచెందారు. తాజాగా కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న సింగరేణి ఓసీపీ-1లో ఆపరేటర్‌గా పనిచేసే 9 సంవత్సరాల వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి గత నెల 3వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధ వ్యాధి చికిత్స పొందుతున్నారు. కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 19కి చేరుకున్నది. 


ఇద్దరితో మొదలై..

జిల్లాలో మొదట ఇద్దరికి మాత్రమే కరోనా వైరస్‌ సోకగా, వారిలో ఒకరు మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారుకాగా, ఇంకొకరు మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారు ప్రయాణించిన రైలులో ప్రయాణించడం వల్ల వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు గానీ, ఇతరులకు గానీ వైరస్‌ సోకకపోవడంతో అంతా ఊపికి పీల్చుకున్నారు. ఆ తర్వాత ముంబాయికి వలస వెళ్లి తిరిగివచ్చిన ఇద్దరు మినహా 13 మందికి హైదరాబాద్‌ కాంటాక్టుల వల్లనే వైరస్‌ రావడం గమనార్హం. ఇది మరింత వ్యాప్తిచెందే ప్రమాదం లేకపోలేదు. జిల్లాలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 19 మందికి కరోనా వైరస్‌ సోకగా, నలుగురు మృతి చెందారు.


ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఒకరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరుగురికి ఇంటి వద్దనే హోం క్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. నలుగురు డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. మేడిపల్లికి చెందిన రేషన్‌ డీలర్‌, పోతన కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు, నాగారంనకు చెందిన ఒక మహిళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా, వైద్యం కోసం వాళ్లు ప్రతి పది, పదిహేను రోజులకోసారి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లి రావడం వల్ల వారికి కరోనా సోకింది. మేడిపల్లికి చెందిన రేషన్‌ డీలర్‌ ద్వారా ఆయన భార్యకు వైరస్‌ సోకింది.


అలాగే ఒక సింగరేణి అధికారికి కరోనా సోకడం వల్ల ఆయన హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన భార్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా, ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి పది, పదిహేను రోజులకోసారి తీసుకపోతుండడం వల్ల సదరు అధికారికి వైరస్‌ సోకింది. సుల్తానాబాద్‌ మండలం కనుకులకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌కు ఉపాధి కోసం వెళ్లాడు. తన సోదరుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చనిపోవడం వల్ల మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకవచ్చి కర్మకాండల రీత్యా ఇక్కడే ఉండిపోయాడు. రెండుమూడు రోజులకే అతడు అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్‌ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరీంనగర్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల ఆయనకు కరోనా సోకింది. కరీంనగర్‌కు వచ్చిన ఆయన తన ఇంటిలో ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సుల్తానాబాద్‌లో ఉండే తన అత్త, మామ, కుటుంబ సభ్యులకు ఆహ్వానించడంతో వాళ్లు కరీంనగర్‌ వెళ్లాడు. కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజే ఆ కానిస్టేబుల్‌ అస్వస్థతకు గురయ్యారు.


అతడికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌ వచ్చింది. అతడి ద్వారా సుల్తానాబాద్‌లో ఉండే తన అత్తా, మామలు, బావమరిది భార్య, మామ తల్లి నలుగురికి వైరస్‌ సోకింది. కానిస్టేబుల్‌ మామ సుల్తానాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తాడు. అతడి ద్వారా ఇంకా మరెవరికైనా వైరస్‌ రావచ్చనే అనుమానాలు పెరిగాయి. సుల్తానాబాద్‌ తహసీల్దార్‌తో పాటు 17మంది సిబ్బందికి పరీక్షలు చేయగా, కదంబాపూర్‌ వీఆర్‌ఓకు వైరస్‌ వచ్చింది. మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లో గోదావరిఖనికి చెందిన రిటైర్డ్‌ సింగరేణి కార్మికుడికి వైరస్‌ సోకి కరీంనగర్‌ ఆసుపత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి ఒకరి కూడా వైరస్‌ సోకింది. వీరిద్దరికి కూడా హైదరాబాద్‌ కాంటాక్టుల వల్లనే వైరస్‌ సోకినట్లుగా తెలుస్తున్నది. హైదరాబాద్‌ కాంటాక్టుల వల్లనే ప్రధానంగా జిల్లావాసులకు వైరస్‌ సోకుతున్నది.  


ర్యాండమ్‌ పరీక్షలను ప్రోత్సహించాలి..

కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తిచెందిందా, లేదా అని తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలను చేయాలని ఆదేశించింది. ప్రతి రోజు వివిధ వర్గాలకు చెందిన వారి నుంచి 50 శాంపిళ్లను సేకరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు శ్రీకారం చుట్టారు. కానీ ఈ పరీక్షలు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. శనివారం రోజున కేవలం 12 మంది నుంచి మాత్రమే శాంపిళ్లను సేకరించారు. ర్యాండమ్‌ పరీక్షల కోసం ప్రణాళికాబద్ధంగా శాంపిళ్లను సేకరిస్తే, తద్వారా వచ్చే పాజిటివ్‌లను బట్టి వైరస్‌ కట్టడి కోసం చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. చాలామంది మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడే స్థానిక అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా అధికారులు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. 

Updated Date - 2020-06-22T10:40:23+05:30 IST