మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది
ABN , First Publish Date - 2020-04-21T09:57:39+05:30 IST
రైతుల కష్టం దళారుల పాలు కావద్దని మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కటింగ్ లేకుండా చర్యలు తీసుకుంటాం
లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలందరు పాటించాలి
మంత్రి ఈటల రాజేందర్
హుజూరాబాద్, ఏప్రిల్ 20: రైతుల కష్టం దళారుల పాలు కావద్దని మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు, అన్ని కుల వృత్తుల వారికి నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లతో భూమికి బరువయ్యో పంట పండిందన్నారు. కాళేశ్వరం నీళ్లు మొదట ముద్దాడిన జిల్లానే ముద్దాడాయన్నారు. గతంలో ఎస్సారెస్పీ కాలువలో 2500 క్యూసెక్యుల నీళ్లు వెళ్లేవని, ఈ సారి 5000 క్యూసెక్యులు వెళ్లాయన్నారు.
ఇది రాష్ట్ర ప్రభుత్వ ఘనతేనని తెలిపారు. కొంత మంది మిల్లర్లు రైతుల ధాన్యంలో తాలు పేరిట తరుగు తీస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై అధికారులకు సూచనలిచ్చామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణి పాల్గొన్నారు.
కంటైన్మెంట్ ఏరియాపై కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి
జిల్లాలో, హుజూరాబాద్ కంటైన్మెంట్ ఏరియాల్లో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ ఎలా కొనసాగుందనే దానిపై కలెక్టర్ శశాంకతో మంత్రి ఈటల రాజేందర్ తన క్యాంపు కార్యాలయంలో చర్చించారు. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో తాలు పేరిట తరుగు తీస్తున్న సమస్యను పరిష్కరించాలని మంత్రి సూచించారు.