చేపల చెరువులు..దళారుల పాలు

ABN , First Publish Date - 2020-08-12T10:20:12+05:30 IST

జిల్లాలో చేపలను నిలువ చేయడానికి కావాల్సిన కోల్డ్‌ స్టోరేజీ, చేపలను విక్రయించడానికి మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో చెరువులు, కుంటలు దళారుల

చేపల చెరువులు..దళారుల పాలు

గుట్టుచప్పుడు కాకుండా లీజులు

నెరవేరని ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో చేపలను నిలువ చేయడానికి కావాల్సిన కోల్డ్‌ స్టోరేజీ, చేపలను విక్రయించడానికి మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో చెరువులు, కుంటలు దళారుల పాలవుతున్నాయి. చెరువుల్లో మత్స్యకారులు సొంతంగా చేపల పెంపకం చేయకుండా దళారులకు గుట్టుచప్పుడుగా లీజుకు ఇస్తున్నారు. కేవలం కొంత మంది మాత్రమే సొంతంగా చేపల పెంపకాన్ని చేపడుతున్నాయి. చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తున్న ఉచిత చేప పిల్లలు దళారుల పాలవుతున్నాయి. ఏడాదికి సుమారు కోటి 20 లక్షల రూపాయలను ప్రభుత్వం చేప పిల్లల కోసం వెచ్చిస్తున్నది. కోల్డ్‌ స్టోరేజీలు, మార్కెట్‌ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రభుత్వ ప్రయోజనం నెరవేరడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో కోటి 53 లక్షల చేప పిల్లలను నీటి వనరుల్లో పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


జిల్లాలో 1,069 చెరువులు, కుంటలు..

జిల్లాలో 1,069 చెరువులు, కుంటలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతీ బ్యారేజీ (సుందిళ్ల), సరస్వతీ బ్యారేజీ (అన్నారం) ఉన్న విషయం తెలిసిందే. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 12.21 లక్షల చేప పిల్లలు, పార్వతీ బ్యారేజీలో 11.41 లక్షల చేప పిల్లలు, సరస్వతీ బ్యారేజీలో 8.79 చేప పిల్లలను పోయనున్నారు. 1,069 చెరువులు, కుంటల్లో ఒక కోటి 21 లక్షల 37 వేల చేప పిల్లలను పోయనున్నారు. ఈ చేప పిల్లల కోసం ప్రభుత్వం కోటి 25 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నది. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై జిల్లాలో గల 134 మత్స్య పారిశ్రామిక సంఘాల్లోని 9,014 మంది పురుషులు, 20 మహిళా సంఘాల్లోని 615 మంది సభ్యులు ఆధారపడి జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా చెరువులు, కుంటలను ఎక్కువ మొత్తంలో దళారులకే లీజుకు ఇస్తున్నారు. కిలోకు 20 నుంచి 30 రూపాయల వరకు తమకు సొమ్మును ఇచ్చేందుకు మత్స్యకారులు గుట్టుచప్పుడుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. చెరువులను లీజుకు తీసుకునే దళారులు వాళ్లే సొంతంగా చేప పిల్లలను తీసుకు వచ్చి పెంచుతుంటారు. అవి కిలో, రెండు కిలోల సైజుకు వచ్చిన తర్వాత పట్టుకెళ్తుంటారు. ఆ చేపలకు ఒప్పందం ప్రకారం మత్స్యకారులకు డబ్బులు చెల్లిస్తుంటారు. 


కోల్డ్‌ స్టోరేజీలు, మార్కెటింగ్‌ సౌకర్యం కరువు..

దళారులు పోసే చేప పిల్లలే గాకుండా ప్రభుత్వం ఇచ్చే ఉచిత చేప పిల్లలు కూడా దళారులకే దక్కుతున్నాయి. ప్రధానంగా రోహు, బొచ్చె, మ్రిగాల, బంగారు తీగ వంటి రకాలను పెంచుతుంటారు. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర 100 నుంచి 120 రూపాయలకు కిలో పలుకుతున్నాయి. కానీ మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకే ఇస్తుంటారు. ఇవి హైబ్రీడ్‌ రకాలు కావడంతో చేపలు పట్టిన తర్వాత కొద్దిసేపటికి చనిపోతుంటాయి. దళారులు వాటిని వెంట వెంటనే ఐస్‌ ట్రేలలో వేసి మహారాష్ట్ర, కలకత్తాకు ఎగుమతి చేస్తుంటారు. కొందరు మత్స్యకారులు సొంతంగా చేపలను పెంచినా వాటికి మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. చేపలు పట్టే సమయంలో లారీలతో పాటు ట్రేలు, ఐస్‌ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సొంతంగా చేపలను పెంచుకునే వారికి ప్రైవేట్‌గా ఐస్‌ లభ్యం కాకుండా దళారులు చూస్తున్నారు. దీంతో చేపలను విక్రయించే పరిస్థితి లేకపోవడంతో మత్స్యకారులు దళారులకే లీజుకు ఇస్తున్నారు. 


పెరిగిన చేపల ఉత్పత్తి..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాలో చేపల ఉత్పత్తి సంపద పెరిగింది. శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌తో పాటు పార్వతీ, సరస్వతీ రిజర్యాయర్లలో పెద్ద ఎత్తున చేపలను పెంచుతున్నారు. రిజర్వాయర్లలో చేపలు పట్టుకునేందుకు మత్స్య శాఖ లైసెన్సులను జారీ చేస్తుంది. లైసెన్సులు పొందిన మత్స్యకారులు ప్రతి రోజు చేపల పట్టి విక్రయిస్తున్నారు. వీటిని స్థానికంగా విక్రయించేందుకు కొందరు వ్యాపారులు వారి వద్ద చేపలను కొనుగోలు చేస్తుండడంతో వారికి సరైన ఉపాధి లభిస్తున్నది. చెరువులు, కుంటల్లో పెరిగే చేపల విక్రయాలకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. చేపల చెరువులను లీజుకు ఇవ్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన మత్స్యశాఖాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వారికి అవగాహన కల్పించి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలు దళారుల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలు, మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-08-12T10:20:12+05:30 IST