కరోనా భయం.. అంత్యక్రియలకు దూరం
ABN , First Publish Date - 2020-04-28T10:30:18+05:30 IST
అందరూ ఉన్నా కరోనా వైరస్ కొందరిని అనాథలుగా మార్చుతోంది. గతంలోనే తండ్రి మరణించగా సోమవారం తల్లి

తల్లి మరణంతో అనాథలుగా చిన్నారులు
దహన సంస్కారాలు జరిపించిన మున్సిపల్ సిబ్బంది
దగ్గరుండి ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): అందరూ ఉన్నా కరోనా వైరస్ కొందరిని అనాథలుగా మార్చుతోంది. గతంలోనే తండ్రి మరణించగా సోమవారం తల్లి మృతిచెందటంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అక్కున చేర్చుకోవాల్సిన బంధువులు కరోనా భయంతో దూరంగా ఉండిపోయారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లెకు చెందిన కొలగాని గంగారెడ్డి-కమలకు కూతురు నాగలక్ష్మి(17), కుమారుడు మల్లిఖార్జున్ (13)లు ఉన్నారు. కూలీ పని చేసుకుని కుటుంబాన్ని సాగదీసే గంగారెడ్డి పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో కమల కూలీ పని చేసుకుని పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. కమల నాలుగు సంవత్సరాలుగా టీబీ వ్యాధితో బాధ పడుతోంది. కూతురు నాగలక్ష్మి బడి మానివేసి కూలి పని చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ తమ్ముడిని చదివిస్తోంది.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కమల మృతిచెందింది. బంధువులకు సమాచారం అందించినా వారి వద్దకు ఎవరూ రాలేదు. అంత్యక్రియలు కూడా జరిపించలేక పోవడంతో విషయం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన స్మశానవాటిక వద్దకు వెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. బల్దియా వైస్ చైర్మన్ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బందితో దహన సంస్కారాలు పూర్తి చేయించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్ అనాథలైన పిల్లలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. అనాథలైన ఇద్దరు పిల్లలను మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదుకుంటామన్నారు. బాలుడిని హాస్టల్‌లో చేర్పించి ఉచితంగా విద్య అందిస్తామని, బాలికకు వొకేషనల్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.