తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-09-21T06:13:15+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు దేశానికే

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

మాది గాలి మాటలు చెప్పే ప్రభుత్వం  కాదు 

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శమనిరాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మంత్రి గంగుల కమలాకర్‌తోకలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసినా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగలేని అన్నారు. రెవెన్యూశాఖలో అవినీతిని అంతం చేసేందుకు వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కులవృత్తులకు సహకారమందిస్తున్నామని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు.


సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. లక్ష ఇళ్లను ఒకే చోట కడతారా అని ప్రశ్నించారు. తాము పారిపోలేదని, పనికిరాని వ్యక్తుల గుర్తించ మాట్లడనని ఆయన చెప్పారు. ఎక్కడెక్కడ ఎన్ని ఇళ్లు కడుతున్నామో లెక్కలు ఇస్తానని, వాస్తవాలను జీర్ణించుకోలేక రాజకీయాలు చేస్తున్నారని బట్టి విక్రమార్కను విమర్శించారు. జీఎస్టీలో లోటు వస్తే భర్తీ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అప్పుతీసుకోమంటుందని అన్నారు. విద్యుత్‌ సంస్థలపై అజామయిషీ కోసం కేంద్రం కుట్ర చేస్తుందని అన్నారు. విద్యుత్‌ విషయంలో లేని ఆంక్షలు పెడితే రైతులకిచ్చే సబ్సిడీ పథకాలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు.


కరోనా నియంత్రణకు 20 లక్షల కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు గైడ్‌లైన్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం తుగ్లక్‌లాగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమతో కలిసివచ్చే ఇతర పార్టీ ఎంపీలతో మోదీ సర్కార్‌ను నిలదీస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఏడాదిన్నర నుంచి ఏమి చేశాడని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చొని పిచ్చిపిచ్చిగా మాట్లాడటం తప్ప నియోజకవర్గానికి ఏమైనా చేశాడా అంటూ ప్రశ్నించారు. సంజయ్‌కు దమ్ముంటే ప్రధానమంత్రి దగ్గర కూర్చొని నిధులు తెచ్చి అభివృద్ధికి కృషిచేయాలని సవాల్‌ చేశారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, నగర మేయర్‌ వై సునీల్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-21T06:13:15+05:30 IST