రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-07T05:59:33+05:30 IST
పరిహారం అందక ఆత్మహత్య చేసుకున్న రైతు సడిమెల కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బాధిత కుటుంబంతో కలిసి పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు.

- బీజేపీ నాయకుల డిమాండ్
- బాధిత కుటుంబంతో కలిసి రాస్తారోకో
- రూ.లక్ష ఆర్థికసాయం అందజేసిన తహసీల్దార్
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 6 : పరిహారం అందక ఆత్మహత్య చేసుకున్న రైతు సడిమెల కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బాధిత కుటుంబంతో కలిసి పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. మిడ్ మానేరు కరకట్ట నిర్మాణంలో భూమి కోల్పోయిన కిషన్ పరిహారం అందక శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానంతరమైనా పరిహారం అందించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు జిల్లా ఆస్పత్రిలో ఉన్న కిషన్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబంతో మాట్లాడారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో 3గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. అధికారులు మంత్రి కేటీఆర్, కలెక్టర్ కృష్ణ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సిరిసిల్ల తహసీల్దార్ మల్లారెడ్డి అక్కడికి చేరుకొని కిషన్ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.లక్ష విలువ చేసే చెక్కును అందజేశారు. రైతు బీమా పథకం కింద రూ.5 లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హమీ ఇచ్చారు. దీంతో నాయకులు రాస్తారోకో విరమించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ, పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్ వేణు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మీ, జిల్లా ఉపాధ్య క్షుడు శ్రీలం రాజు, మేకల కమలాకర్, శ్రీగాధ మైసయ్య, మల్లఢపేట భాస్కర్, అడేపు రవీందర్, గాజుల వేణు, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.