మహిళల అభివృద్ధికి పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2020-03-12T11:41:43+05:30 IST

మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చైర్యలు తీసుకుంటోందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

మహిళల అభివృద్ధికి పటిష్ట చర్యలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు కృషి 

 జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు


పెద్దపల్లి టౌన్‌, మార్చి 11: మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చైర్యలు తీసుకుంటోందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. బుధవారం అమర్‌చంద్‌ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆయన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పౌష్టికాహార లోపం కొంతమేర ఉందని, దానిని నివారించేందుకు అందరం కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మహిళల రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ షీటీంలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రజలంతా ఐక్యతతో మహిళల పట్ల ఉన్న వివక్షను దూరం చేస్తే దాడులు తగ్గుముఖం పడుతాయన్నారు. మహిళల్లో లింగవివక్ష అధికంగా ఉంటోందని, మహిళలే మహిళలకు శత్రువులుగా వ్యవహరిస్తున్నారని జడ్పీ చైర్మన్‌ ఆవేదన చెందారు. సమాజంలో కొంత మంది తల్లితండ్రులను సరిగా చూడటం లేదని అన్నారు. లింగ వివక్ష నిర్మూలన దిశగా అందరూ నడుం బిగించాల్సిన సమయం వచ్చిందన్నారు.


అంగన్‌వాడీ  సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉంటారని, లింగ వివక్షకు వ్యతిరేకంగా వారు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన సోలార్‌, ఫర్నిచర్‌, ఇతర పరికరాలు అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ నిధులు సైతం ఆ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు అందించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారన్నారు.


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళ దినోత్సవం వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. మనందరి సమష్టి కృషి ఫలితంగా పెద్దపల్లి జిల్లాను మహిళా సాధికారతలో రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ కోరారు. అనంతరం కలెక్టర్‌ పోషణ్‌ పక్షం పోస్టర్‌ను పలువురితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ మమతా, జడ్పీ వైస్‌చైర్మన్‌ రేణుక, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్‌రావు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T11:41:43+05:30 IST