-
-
Home » Telangana » Karimnagar » state planing comission vice president
-
అభివృద్దే మా సిద్దాంతం...
ABN , First Publish Date - 2020-12-31T04:51:07+05:30 IST
టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతం అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వ ఆశయం రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సమస్యలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.

ప్రజా సమస్యలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం
స్మార్ట్‌సిటీ నిధులను ఎవరూ ఆపలేరు...
తెలంగాణాలో రంగును బట్టి రాజకీయాలు చేయం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 2: టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతం అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వ ఆశయం రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సమస్యలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్న సర్కస్‌గ్రౌండ్, మల్టీపర్పస్ పార్కుల అభివృద్ధి పనులను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోపాటు తామంతా పట్టుబట్టి కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా తీసుకువచ్చామని చెప్పారు. నగర అభివృద్ధి కోసం కృషిచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ శశాంక, కమిషనర్ క్రాంతిలకు ప్రభుత్వం పక్షాన వినోద్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే కరీంనగర్‌ను గొప్పనగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లకు రాష్ట్ర బడ్జెట్ నుంచి నేరుగా నిధులు అందించామని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 350 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. కరీంనగర్, వరంగల్‌ను స్మార్ట్‌సిటీ జాబితా నుంచి తొలగించారని, నిధులు రావనే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్‌సిటీ నిధుల విషయంలో అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ అధికారులతో మాట్లాడామని, నిధులను ఎవరూ అడ్డుకోలేరన్నారు. కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్మార్ట్‌సిటీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద నిధులు ఇవ్వలేదని చెప్పడం అవాస్తవమని, ఇప్పటికే 300 కోట్ల రూపాయల వరకు వెచ్చించామని, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పరోక్షంగా విమర్శించారు. 2013 ఉద్యమసమయంలోనే కరీంనగర్ అభివృద్ధిపై ఆలోచన చేశామని, ఇందులో భాగంగానే ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఐటీ టవర్ ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే మానేరు రివర్‌ఫ్రంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీని తెస్తామని వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ను జాతీయ రహదారుల జంక్షన్‌గా మార్చేందుకు ఎస్‌ఈ కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకువచ్చామని, ఇప్పటికే కరీంనగర్‌తో కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులకు ప్రతిపాదనలను పంపించామన్నారు. తెలంగాణాలో రంగును బట్టి రాజకీయాలు చెయ్యమని, నల్లోడా తెల్లోడా అని చూడమని, కులమత రాజకీయాలు ఇక్కడ ఉండవని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కె శశాంక, మేయర్ వై సునీల్‌రావు, కమిషనర్ వల్లూరి క్రాంతి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.