అధ్వానంగా ఎస్సారెస్పీ కాలువలు
ABN , First Publish Date - 2020-03-16T08:50:58+05:30 IST
మండలంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఈ కాలువల మరమ్మతులు చేయకపోవడంతో పిచ్చి మొక్కలు నిండి ఉన్నాయి.
పేరుకుపోయిన చెత్త, మొలిచిన పిచ్చి మొక్కలు
పట్టంచుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
కాల్వశ్రీరాంపూర్, మార్చి 15: మండలంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఈ కాలువల మరమ్మతులు చేయకపోవడంతో పిచ్చి మొక్కలు నిండి ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత అప్పటి కలెక్టర్ అలుగు వర్షిణీ ఎస్సారెస్పీ కాలువలు పరిశీలించి టేలాండ్ ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సంబంధిత ఎస్సారెస్పీ అధికారుల పర్యవేక్షణలో ఉపాధిహామీ పథకం ద్వారా కాలువలన్నింటిని మరమ్మతులు చేయించారు. దీంతో మండలంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించడంతో ఎస్సారెస్పీ నీరు చివరి ప్రాంతాలకు చేరింది. అప్పడు కలెక్టర్ కాలువల వెంట తిరిగి నీరు చివరి వరకు వచ్చేలా చర్యలు చేపట్టారు. తరువాత ఈ కాలువల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో మళ్లీ ఈ కాలువలు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండి పోయింది. అక్కడక్కడ కాలువల్లో సీసీ కూడా పోయింది. దీంతో కాలువ నీరు చివరి ప్రాంతాలకు అందకపోవడంతో రైతులు బావులను ఆశ్రయిస్తున్నారు. మండలంలోని డీ-86, 83 ఎస్సారెస్పీ కాలువలు ఉన్నాయి.
డీ-83 వెన్నెంపల్లి, కునారం, మంగపేట, జాఫర్‌ఖాన్‌పేట, పెద్దరాత్‌పల్లి నుంచి ఇద్లాపూర్ వరకు ఉంది. అలాగే డీ 86 జగ్గయ్యపల్లి, మల్యాల, తారుపల్లి, మీర్జంపేటతోపాటు వీటికి ఉప కాలువలు పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్, గంగారం, ఊషన్నపల్లి, లక్ష్మిపురం, పెద్దంపేట, పందిల్ల, చిన్నరాత్‌పల్లి, కిష్టంపేట, మొట్లపల్లి వరకు ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు సంబంధిత కాంట్రాక్టర్లు నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు కాలువల చుట్టు సీసీ చేశారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ వీటిని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ కాలువల్లో పెరిగిన చెత్తను తొలగించి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.