మరొకరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-07T10:27:00+05:30 IST

హుజూరాబాద్‌లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడి నుంచి మర్కజ్‌కు వెళ్లిన ఇద్దరికి కరోనా సోకింది. వారిలో ఒకరి సోదరుడికి కూడా కరోనా వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 18కి

మరొకరికి పాజిటివ్‌

హుజురాబాద్‌లో మూడుకు పెరిగిన కరోనా బాధితులు 

జిల్లాలో 18కి చేరిన వ్యాధిగ్రస్తులు

11 మంది డిస్‌చార్జ్‌ 

ఏడుగురికి కొనసాగుతున్న చికిత్స


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

హుజూరాబాద్‌లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడి నుంచి మర్కజ్‌కు వెళ్లిన ఇద్దరికి కరోనా సోకింది. వారిలో ఒకరి సోదరుడికి కూడా కరోనా వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 18కి  చేరింది. గత నెల 14న 10 మంది ఇండోనేషియన్లు జిల్లాకు  మతప్రచారానికి రాగా వారితోపాటు వారికి సహాయకులుగా ఉన్న ఇద్దరికి, అందులో ఒకరి తల్లికి, సోదరికి కరోనా  సోకింది. మర్కజ్‌కు జిల్లానుంచి 19 మంది ప్రార్థనలకు వెళ్ళగా వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అందులో ఒకరి సోదరుడికి తాజాగా కరోనా సోకినట్లు వైద్య నివేదిక ద్వారా వెల్లడైంది. జిల్లాలో 18 మందికి కరోనా సోకగా అందులో ఇప్పటికే 11 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిస్‌చార్జ్‌ అయ్యారు. వారంతా  మరో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారు. మిగిలిన ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కశ్మీరుగడ్డ, ముకరంపుర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి ఎవరినీ బయటకు రాకుండా నిర్భంధం చేసి వారికి సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. మర్కజ్‌కు వెళ్ళివచ్చిన 19 మందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌, మరో 13 మందికి నెగెటివ్‌ వచ్చింది. మిగిలిన ముగ్గురి రిపోర్టులు రావలసి ఉన్నది. 


అనుమానితులను క్వారంటైన్‌కు తరలింపు

హుజూరాబాద్‌లో కరోనా సోకిన ముగ్గురు ఎవరెవరినికలిశారు, ఇంకా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వారి కుటుంబసభ్యులు, సన్నిహితులను గుర్తించి కరీంనగర్‌లోని క్వారంటైన్‌కు తరలించి వారి నమూనాలను సేకరించి హైదరాబాద్‌ గాంధీ ఆస్పపత్రికి పంపిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ క్వారంటైన్‌లో 82 మంది, చల్మెడ ఆనందరావు వైద్యవిజ్ఞాన సంస్థలో 32 మంది ఉన్నారు.  జిల్లాలో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. 


జాగ్రత్తలు పాటిస్తున్న ప్రజలు

ప్రజలు ఉదయం 11 గంటల వరకే ఏమైనా అత్యవసరపనులుంటే వాటిని పూర్తి చేసుకొని ఇంటికి  చేరుకుంటున్నారు. లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల కోసం జనం రోడ్లపైకి వస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండడంతో దుకాణాల ముందు క్యూ కడుతున్నారు.  కరోనా వైరస్‌ ఒకరితో ఒకరికి వ్యాప్తిచెందుతుందని తప్పకుండా భౌతిక దూరం పాటించాలనే సూచిస్తుండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. 


హుజూరాబాద్‌లో అప్రమత్తమైన అధికారులు

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో సోమవారం అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని మర్కజ్‌ యాత్రకు వెళ్లి రాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు వారి కుటుంబ సభ్యులను ఏడుగురిని కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అందులో మరొకరికి పాజిటివ్‌ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కూరగాయల మార్కెట్‌ ఏరియాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేసి హైపో క్లోరిన్‌ మందును పిచికారి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ బావ్‌సింగ్‌, సీఐ మాధవి మాట్లాడుతూ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను మున్సిపల్‌ సిబ్బంది వారు అందిస్తారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-07T10:27:00+05:30 IST