ఎల్‌ఎండీలో సౌరవిద్యుత్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2020-12-29T04:59:44+05:30 IST

కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయాన్ని సోమవారం సింగరేణి ఉన్నతాధికారులు సందర్శించారు.

ఎల్‌ఎండీలో సౌరవిద్యుత్‌ ప్లాంట్‌
ఎల్‌ఎండి రిజార్వాయర్‌ ను సందర్శించిన సింగరేణి ఉన్నతాధికారులు

 ప్రాజెక్టును సందర్శించిన సింగరేణి ఉన్నతాధికారులు

 సుమారు 350 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం

తిమ్మాపూర్‌/గోదావరిఖని డిసెంబరు 28 : కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయాన్ని సోమవారం సింగరేణి ఉన్నతాధికారులు  సందర్శించారు. లోయర్‌ మానేరు రిజర్వాయర్‌లో నీటిపై తేలియడే సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రెన్యూవబుల్‌ ఎనర్జీ(టీఎస్‌రెడ్‌కో) అధికారులతో కలిసి సింగరేణి, నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టును పరిశీలించారు. భారీ రిజర్వాయర్లలో నీటిపై తేలియడే సౌర విద్యుత్‌ ప్లాంట్లు నిర్మించాలని కరీంనగర్‌కు ఆనుకుని ఉన్న దిగువ మానేరు జలాశయాన్ని ఎంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 350 మెగావాట్ల సామర్ధ్యంతో నీటిపై తేలియాడే సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి మూడు జలాశయాలపై అధ్యయనం చేశామని వీటిలో కరీంనగర్‌ దిగువ మానేరు జలాశయం అనుకూలంగా ఉంటుందని పరిశీలించినట్లు తెలిపారు. ఇందుకోసం గతంలో కూడా ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను పరిశీలించినట్లు తెలిపారు. ఎల్‌ఎండీ పూర్తి స్ధాయిలో నీరు నిండి ఉన్నప్పుడు దాదాపు 82 చదరపు కిలోమీటర్ల నీటి విస్తీర్ణం ఉంటుందన్నారు.  సౌరప్లాంట్‌కు కేవలం 12.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం సరిపోతుందని దీని ద్వారా సుమారు 350 మెగావాట్ల సామర్ధ్యంతో  విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయినందున ఎల్‌ఎండీలో నీటికి కొరత ఉండదని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ఎల్‌ఎండీలో నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సింగరేణి అధికారులు తెలిపారు. ఎల్‌ఎండీని సందర్శించిన వారిలో సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ, జనరల్‌ మేనేజర్‌(సోలార్‌) సూర్యనారాయణ రాజు, జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు, కన్సల్టెంట్‌ సోలార్‌ మురళీధరన్‌, డైరెక్టర్‌ పవర్‌ విశ్వనాధరాజు, డీజీఎం సోలార్‌ శ్రీనివాస్‌, రెడ్‌ కో మేనేజర్‌ రవీందర్‌, నీటిపారుదల శాఖ నుండి ఎస్‌ఈ శివ కుమార్‌, ఏఈఈ వంశీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:59:44+05:30 IST