‘కట్టడి’ప్రాంతాల్లో కఠినతరం

ABN , First Publish Date - 2020-04-18T10:35:22+05:30 IST

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తున్నది. రెండురోజుల క్రితం కొత్తగా మరో కరోనా పాజిటివ్‌

‘కట్టడి’ప్రాంతాల్లో కఠినతరం

ముమ్మరంగా స్ర్కీనింగ్‌ పరీక్షలు 

కొనసాగుతున్న పారిశుధ్య పనులు 

పటిష్టంగా నిబంధనలు


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 17: కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తున్నది. రెండురోజుల క్రితం కొత్తగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతమైన సాహెత్‌నగర్‌, శర్మనగర్‌, సాయినగర్‌ కట్టడి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఓవైపు వైరస్‌ వ్యాప్తి  చెందకుండా ముమ్మరంగా పారిశధ్య పనులు చేపడుతూనే మరోవైపు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక వైద్య బృందాలు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


అలాగే కశ్మీరుగడ్డ, ముకరంపుర, మంకమ్మతోట కట్టడిప్రాంతాల్లో కూడా వైద్య బృందాలు స్ర్కీనింగ్‌ టెస్టులను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం కట్టడిప్రాంతాల్లో 41 వైద్య బృందాలు 1464 ఇళ్లకు వెళ్లి 5,730 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, డయాబెటీస్‌, బీపీ, కిడ్నీ, అస్తమా రోగుల వివరాలను సేకరిస్తున్నారు. కరోనా వైరస్‌ వీరికి త్వరగా సోకే అవకాశాలుండడంతో వారి వివరాలను సేకరించి ప్రతి రోజు వారి ఆరోగ్య పరిస్థితులను ఉదయం, సాయంత్రం తెలుసుకొని అవసరమైన వారికి చికిత్సలు అందిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన వారికి పరీక్షలు, చికిత్స చేయిస్తున్నారు.


రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతుండడంతో కట్టడిప్రాంతాల్లో  ప్రత్యేక దృష్టిసారిస్తూనే మరోవైపు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలుపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు కొనుగోలు కోసం, బ్యాంకుల వద్ద డబ్బుల కోసం వచ్చే వారు విధిగా భౌతిక దూరం పాటించేలా వాలంటీర్లు, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూను మరింత పక్బందీగా అమలు చేసేందుకు పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


కట్టడిప్రాంతాలలో ప్రజలు విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చూడాలని, ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్సులో ఆదేశించడంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పేదలను ఆదుకోవాలనే వారు విధిగా మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశించడంతో దాతలు అనుమతి తీసుకొని వారికి సూచించిన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. 


Updated Date - 2020-04-18T10:35:22+05:30 IST