సన్నాల మంట

ABN , First Publish Date - 2020-11-22T05:09:30+05:30 IST

రైతులు గతంలో నారు పోసుకొని చినుకుల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూసే వారు. పెట్టుబడులైనా మిగులుతాయో లేదోనని ఆందోళన పడేవారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన నియంత్రిత సాగులో సన్నరకం వరి సాగు చేసి మద్దతు ధర కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు.

సన్నాల మంట
రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

 - మద్దతు ధరపై రైతుల ఆందోళన  

- జిల్లాలో రోడ్డెక్కుతున్న అన్నదాతలు 

- రూ.2500 చెల్లించాలని డిమాండ్‌

- విపక్షాల మద్దతు 

-  జిల్లాలో 1.39 లక్షల ఎకరాల్లో వరిసాగు 

- 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిపై అంచనా 

-1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో సన్నరకం 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రైతులు గతంలో నారు పోసుకొని చినుకుల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూసే వారు. పెట్టుబడులైనా మిగులుతాయో లేదోనని ఆందోళన పడేవారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన నియంత్రిత సాగులో సన్నరకం వరి సాగు చేసి మద్దతు ధర కోసం  ప్రభుత్వం వైపు చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం చెప్పిన విధంగా సన్నరకాలు వేయడానికి  రైతులు ముందుకొచ్చారు. సన్నరకం సాగుతో దిగుబడి తక్కువగా వచ్చింది.  తెగుళ్లు ఎక్కువగా సోకాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావంతో కురిసిన అధిక వర్షాలతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో సన్నరకం పండించిన రైతులు ధాన్యాన్ని దొడ్డురకం ధర కంటే తక్కువగా అమ్ముకోలేక అయోమయానికి గురవుతున్నారు. తెగుళ్లు ఎక్కువవడంతో జిల్లాలోని కొన్ని చోట్ల రైతులు పంటను దహనం చేశారు.  కనీసం దొడ్డురకానికి చెల్లించే ధరకు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. విపక్షాల నేతలు రైతులకు అండగా నిలుస్తున్నారు. క్వింటాల్‌కు రూ.2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాల నేతలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం  స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో 366 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సాగులో 2 లక్షల 48వేల159 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో లక్షా 39 వేల 691 ఎకరాల్లో వరి పంట వేశారు. దొడ్డురకం 73,070 ఎకరాలు, సన్నరకం 66,621 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో సన్నరకం దిగుబడి 1.10 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటుందని భావించినా అధిక వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గే అవకాశాలు ఏర్పడ్డాయి. జిల్లాలో ఇప్పటి వరకు 227  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా 225 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా 11,421 మంది రైతుల నుంచి 45,244 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో కేవలం 366 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేయడం గమనార్హం. రైతులు కూడా ప్రభుత్వం సన్నరకం ధాన్యంపై ఏదైనా నిర్ణయం ప్రకటిస్తుందోమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కనీస మద్దతు ధర కింద గ్రేడ్‌ ఏ రకం దొడ్డు ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1888 చెల్లించి కొనుగోలు చేస్తుండగా సాధారణ రకం కింద సన్న ధాన్యాన్ని రూ.1868 ద్వారా కొనుగోలు చేస్తోంది.  మద్ధతు ధర పెరగకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. విపక్షాలు కూడా రైతులకు మద్దతుగా ఆందోళనను ఉధృతం చేయడానికి సిద్ధమయ్యాయి.  

24న సీపీఐ ధర్నా  

సన్నరకానికి క్వింటాల్‌కు  రూ.2500 మద్దతు ధర చెల్లించాలని  సీపీఐ ఆధ్వర్యంలో  ఈ నెల 24న   సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టేందుకు   రైతులు, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2020-11-22T05:09:30+05:30 IST