సొంతింటి కల నెరవేరేదెప్పుడు?

ABN , First Publish Date - 2020-11-07T10:28:41+05:30 IST

పేద, మధ్య తరగతి కుటుంబీకుల సొంతింటి కల నెరవేరడం లేదు. డబుల్‌ బెడ్‌రూముల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆశల పల్లకీలో ఊరేగించిన రాష్ట్ర ప్రభుత్వం దానిగురించి పట్టించుకోవడం లేదు

సొంతింటి కల నెరవేరేదెప్పుడు?

మంజూరైన ఇళ్లు 3,394..

పనులు ప్రారంభమైనవి 1,713..

కాల్వశ్రీరాంపూర్‌, మంథనిల్లో పూర్తి

సుల్తానాబాద్‌లో నిలిచిన నిర్మాణాలు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పేద, మధ్య తరగతి కుటుంబీకుల సొంతింటి కల నెరవేరడం లేదు. డబుల్‌ బెడ్‌రూముల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆశల పల్లకీలో ఊరేగించిన రాష్ట్ర ప్రభుత్వం దానిగురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో అక్కడక్కడా పూర్తయిన ఇళ్లను సైతం లబ్ధిదారులకు కేటాయించకపోవడం విచారకరం. ‘బిడ్డా అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, గొడ్డు, గోదా ఉండేందుకు స్థలం ఉండవద్దా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు పడకల ఇళ్లు నిర్మించి ఇస్తాం’ అని సీఎం కేసీఆర్‌ 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకుండాపోతున్నది. ఇదేగాకుండా గడిచిన ఎన్నికల్లో ఇంటి స్థలం ఉన్నటువంటి పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు ఇస్తామని చెప్పిన సీఎం ఆ మాటను కూడా నిలబెట్టుకోకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. 


అనుమతులు ఇచ్చినా..

జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గాల్లోని పట్టణాలు, మండలాలకు 2015-17 ఆర్థిక సంవత్సరాలకు ప్రభుత్వం 3,394 ఇళ్లను మంజూరు చేయగా, వీటికి అధికారులు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,994 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,400 ఇళ్లను కేటాయించారు. మొదటి విడతలో మంజూరైన 1065 ఇళ్లకు లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఇప్పటివరకు మొత్తం 3,145 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించగా, గ్రామీణ ప్రాంతాల్లో 1,196, పట్టణ ప్రాంతాల్లో 1,400, మొత్తం 2,596 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. ఇందులో 1,713 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే మొదలయ్యాయి. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, సుల్తానాబాద్‌, మంథని, అంతర్గాం, గోదావరిఖని, పాలకుర్తి మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో మూడంతస్తుల్లో 240 ఇళ్ల పనులను చేపట్టగా, 170 వరకు పూర్తికాగా, మిగతా ఇళ్లు పూర్తి దశలో ఉన్నాయి. మంథని పోచమ్మవాడలో చేపట్టిన 98 ఇళ్లు పూర్తికాగా, కూచిరాజ్‌పల్లిలో చేపట్టిన ఇళ్ల పనులు నడుస్తున్నాయి.


రామగుండం నియోజకవర్గానికి సంబంధించి చేపట్టిన 680 ఇళ్ల పనులు నడుస్తున్నాయి. వీటిలో అంతర్గాంలో మూడంతస్తుల్లో చేపట్టిన పనులు నడుస్తున్నాయి. ఓదెల మండల కేంద్రంలో 48 ఇళ్లు పూర్తి కావస్తుండగా, మరో 100 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సుల్తానాబాద్‌ మార్కండేయ కాలనీలో మూడంతస్తుల్లో చేపట్టిన 80 ఇళ్ల పనులు స్లాబ్‌ లెవెల్‌లోనే నిలిచిపోయాయి. పాలకుర్తి, ధర్మారం మండలం బొట్ల వనపర్తి, తదితర గ్రామాల్లో చేపట్టిన ఇళ్ల పనులు ముందుకు సాగడం లేదు. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం లేదు. డబుల్‌ ఇళ్ల నిర్మాణ పథకంపై అనేకమంది పేదలు ఆశలు పెంచుకున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5.04 లక్షల రూపాయలు, ఇతరత్రా సదుపాయాలకు 1.25లక్షల రూపాయలు కేటాయించగా, ఆ డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదు.


యూనిట్‌ అంచనా వ్యయాన్ని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పెంచడంలేదు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చే బదులు 5లక్షల రూపాయలు తమకు ఇస్తే కొంత సొమ్మును కలుపుకుని ప్రభుత్వం సూచించిన ప్రకారమే ఇళ్లు నిర్మించుకుంటామని చెబుతున్నా కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని ప్రకటించినప్పటికీ దాని ఊసెత్తడం లేదని పేదలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాకు మంజూరుచేసిన డబుల్‌ బెడ్‌రూముల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-11-07T10:28:41+05:30 IST