నేటి నుంచి వరిధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-04-15T10:48:25+05:30 IST

జగిత్యాల జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి వరిధాన్యం కొనుగోళ్లు

జిల్లావ్యాప్తంగా 1200 హార్వెస్టర్లు 

ఇప్పటికే సిద్ధంగా ఉన్న కోటి గన్నీ సంచులు


 ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశా లకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ రవి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 380 గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఆరున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం కోటి 25 లక్షల గన్నీ సంచులు అవసరం ఉండగా, ఇప్పటికే కోటి గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. మరో 25 లక్షల గన్నీ సంచులు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


అయితే లాక్‌డౌన్‌ వల్ల జిల్లాలో హమాలీల కొరత ఏర్పడే అవకాశం ఉంది. బీహార్‌, ఒరిస్సా ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి హమా లీలు వస్తుండగా, లాక్‌డౌన్‌ వల్ల రాలేకపోయారు. దీంతో జిల్లాలో ఉన్న వలస కూలీలతోనే హమాలీ పనిచేయాలని నిర్ణయించారు. దీనికితోడు గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తున్న కూలీలను కూడా గుర్తించారు. అయితే 40 కేంద్రాల్లో హమాలీల కొరత ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటికే 1200 హార్వెస్టర్లు సిద్ధంగా ఉండగా, కొన్ని చోట్ల గ్రామ పంచాయతీల యాజమాన్యాలు అనుమతి తీసుకోవాలంటూ నిబంధనలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. వరిధాన్యం కొనుగోలుకు ముందుగా టోకెన్లను జారీ చేశారు. అయితే రోజుకు 50 మంది రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని నిర్ణయించగా, కొనుగోళ్లనుబట్టి ఎక్కువ మంది రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.


ఎవరైనా ముందుగానే పంట కోసినట్లయితే పొలం వద్ద ఆరబెట్టుకుని, ఇచ్చిన తేదీ ప్రకారం పంట అమ్మకానికి తేవాలని ఆదేశించారు. లాటరీ విధానంపై కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. పంట పొలం వద్ద ఆరబెట్టుకునేందుకు స్థలం కూడా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్‌, సారం గాపూర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసారి జిల్లాలో ధాన్యాన్ని పూర్తిగా ఈ జిల్లా రైస్‌మిల్లర్లకే లెవీగా అందించాలని నిర్ణయించారు. దీనికి తోడు ఈసారి నిర్మల్‌ జిల్లా నుంచి కూడా 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం జిల్లాకు లెవీ కింద వస్తున్నట్లు తెలిసింది.


Updated Date - 2020-04-15T10:48:25+05:30 IST