నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-12-21T05:10:05+05:30 IST

ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్లు షురూ కానున్నాయి.

నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

వంద రోజులుగా ఆగిన ప్రక్రియ

పాత పద్ధతిలోనే కొనసాగింపు

స్లాట్‌ బుకింగ్‌కు తాత్కాలిక బ్రేక్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్లు షురూ కానున్నాయి. వంద రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేకులు పడడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పాత విధానంలోనే కొనసాగనుంది. ఉమ్మడి  జిల్లా వ్యాప్తంగా 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం భూముల లావాదేవీలన్నీ నిలిచి పోవడంతో రియల్‌ వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళన చేపట్టారు. లోపభూయిష్టంగా ఉన్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. వంద రోజులపాటు ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ  నెల 17న హైకోర్టు ఆదేశాలతో స్లాట్‌ బుకింగ్‌ను తాత్కాలింగా నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ఫ్లాట్లు, భవన  నిర్మాణ అనుమతులు లేని వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అమలులో ఉండడంతో ఎల్‌ఆర్‌ఎస్‌, భవన నిర్మాణ అనుమతులు ఉన్న వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో పాటు,  మ్యుటేషన్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది.

ప్రభుత్వ ఆదాయానికి గండి

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు వంద రోజులుగా ఆగి పోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్లాట్‌ బుకింగ్‌ ద్వారా ప్రారంభించగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతంత మాత్రంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంలో రిజిస్ట్రేషన్ల వేగం పెరగనున్నది. శనివారం వరకు స్లాట్‌ బుకింగ్‌ అయిన భూములన్నింటిని రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో ప్రభుత్వ ఆదాయం పెరగనుంది.   

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెల్లువ....

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,12,882 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 26,777 దరఖాస్తులు, రామగుండంలో 7,074 దరఖాస్తులు వచ్చాయి. జమ్మికుంట 5,902, హుజూరాబాద్‌ 3,969, కొత్తపల్లి 2660, చొప్పదండిలో 1467 దరఖాస్తులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో 899, పెద్దపల్లిలో 9,758, సుల్తానాబాద్‌లో 1534, జగిత్యాల జిల్లాలో జగిత్యాల 7,978, కోరుట్లలో 9,154, మెట్‌పల్లిలో 5,958, ధర్మపురిలో 1008, రాయికల్‌లో 1,893 దరఖాస్తులు వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో 10,486, వేములవాడలో 16,886 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకుంటే భూముల క్రయ విక్రయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. కరీంనగర్‌, కరీంనగర్‌ రూరల్‌, హుజూరాబాద్‌, గంగాధర, జగిత్యాల, కోరుట్ల, మల్యాల, మెట్‌పల్లి, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌, సిరిసిల్ల, వేములవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఒక్కో కార్యాలయంలో పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. వంద రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగి పోవడంతో పూర్తిగా లావదేవీలు నిలిచి పోయాయి. సోమవారం  నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంలో రియల్‌ వ్యాపారం జోరుగా సాగనుంది. 

Updated Date - 2020-12-21T05:10:05+05:30 IST