రాజన్న క్షేత్రంలో.. 11 నుంచి శివ కల్యాణోత్సవాలు

ABN , First Publish Date - 2020-03-04T07:31:03+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శివకల్యాణ మహోత్స వాల కు ముస్తాబవుతోంది.

రాజన్న క్షేత్రంలో..  11 నుంచి శివ కల్యాణోత్సవాలు

వేములవాడ, మార్చి 3: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శివకల్యాణ మహోత్స వాల కు ముస్తాబవుతోంది. 11వ తేదీ బుధవారం నుంచి 15వ తేదీ ఆదివారం వరకు ఐదు రోజులపాటు శివకల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆలయ అధికారు లు ఏర్పాట్లు ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ గురువారం రోజున పార్వతీరాజరాజేశ్వరస్వామివారల దివ్య కల్యా ణం, 14వ తేదీ శనివారం స్వామివారల రథోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. తొలి రోజు 11వ తేదీ బుధవారం ఉదయం శివభగవత్‌ పుణ్యహవాచనంతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. తదుపరి పంచగవ్య మిశ్రణం, దీక్షా ధారణం, ఋత్విక్‌వరణం, మంటప ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట  వంటి పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వేద పారాయణములు, పరివార దేవతార్చనలు, శివపురాణ ప్రవచనం, భేరి పూజ, దేవతాహ్వానం నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం తీర్థరాజ పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకములు, పారాయణములు, అవాహిత దేవతార్చనలు, వృషభ యాగం, ధ్వజారోహణం, ఎదు ర్కోళ్లు అనంతరం  పార్వతీ రాజరాజేశ్వరస్వామివారల దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం శివపురాణ ప్రవచనం, ప్రధాన హోమము, బలిహరణము, పెద్ద సేవ ఊరేగింపు నిర్వహిస్తారు.


13వ తేదీ ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకములు, ఔపాసనము, బలిహరణం, శివపురాణ ప్రవచనం, సదస్యం నిర్వహిస్తారు. 14వ తేదీ ఉదయం స్వామివారికి మ హన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, ఔపాసనము, బలిహరణం, ఏకాదశ రుద్ర కలశ స్థాపన, రుద్రయా గం, రథప్రతిష్ట, రథహోమం, సాయంత్రం స్వామివారి రథోత్సవం, రాత్రి శృంగార వసంతోత్సవం నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, పారాయణములు, అభిషేకములు, శేషహోమం, జయాదులు, పూర్ణాహుతి, దేవతోద్వాసనము, నాకబలి, పుష్పయాగం, క్షేత్రపాలక బలి, త్రిశూలయాత్ర, అవబృధ స్నానం అనంతరం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. 

Updated Date - 2020-03-04T07:31:03+05:30 IST