నేటి నుంచి రైతుబంధు

ABN , First Publish Date - 2020-12-28T04:31:38+05:30 IST

రైతుబంధు పథకం కింద యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

నేటి నుంచి రైతుబంధు

అన్నదాతల ఖాతాల్లోకి రూ. 178.94 కోట్లు

నాలుగు రోజుల్లో ఖాతాల్లో జమ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రైతుబంధు పథకం కింద యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 28 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభంలోగా రైతులందరికి ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు చెందిన కోటి 52 లక్షల ఎకరాలకు, ఎకరాకు 5 వేల రూపాయల చొప్పన 7,515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లాలోని 1,76,138 మంది రైతులకు 178 కోట్ల 94 లక్షల 26,642 రూపాయల లబ్ధి చేకూరనున్నది. జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటికే ఈ రైతులందరిని గుర్తించి వివరాలన్నింటిని ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పటి వరకు 1,63,093 మంది రైతులకు సంబంధించిన వివరాలు బ్యాంకులకు అప్‌డేట్‌ చేయగా 171 కోట్ల 62 లక్షల 54 వేల 480 రూపాయల పంపిణీకి రంగం సిద్ధమయింది. ఒకటి రెండు రోజుల్లో మిగతా రైతుల అకౌంట్లు అప్‌డేట్‌ చేసి అందరికి పంట సాయం అందించాలని నిర్ణయించారు. కొత్త సంవత్సరం ఆరంభానికల్లా రైతులందరికి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమయ్యే అవకాశం ఉన్నది. నెలాఖరు బ్యాంకు సెలవులతో ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా వారం రోజుల్లోగానే జిల్లాలోని రైతులందరికి రైతుబంధు నిధులు అందుబాటులోకి వచ్చి యాసంగి సాగుకు ఉపయోగపడనున్నవి.. 

ఐదు సీజన్లలో  675 కోట్ల పెట్టుబడి సాయం

 రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ వారు ప్రైవేట్‌ అప్పుల బారిన పడకుండా చూసేందుకు పెట్టుబడి సహాయం అందించాలని భావించిన నేపథ్యంలో రైతుబంధు పథకం రూపుదాల్చింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018 ఖరీఫ్‌ నుంచి ప్రారంభించింది. ప్రారంభంలో ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించిన ప్రభుత్వం ఆ తర్వాత దానిని 5 వేల రూపాయలకు పెంచింది. 2018 ఖరీఫ్‌లో జిల్లాలోని 206 గ్రామాల్లో 1,45,245 మంది రైతులు ఉన్నారని గుర్తించారు. వీరు సాగు చేస్తున్న భూమికి ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున  124 కోట్ల 58 లక్షల 85 వేల 100 రూపాయలు పెట్టుబడి సాయంగా అందించాలని నిర్ణయించారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం, బ్యాంకు అకౌంట్లు సరిగా లేకపోవడం, బ్యాంకు అకౌంట్లతో ఆధార్‌కార్డులు అనుసంధానం కాకపోవడం తదితర కారణాలతో 1,30,212 మంది రైతులకు 117 కోట్ల 64 లక్షల 8,420 రూపాయలు వారి వారి ఖాతాల్లో జమయ్యాయి. అదే సంవత్సరం రబీలో 1,48,759 మంది రైతులకు 130 కోట్ల 56 లక్షల 70,350 రూపాయలు పెట్టుబడి సాయంగా అందించాలని నిర్ణయించి అందుకు చెక్కులు తయారు చేయగా 1,33,329 మంది రైతులకు 122 కోట్ల 94 లక్షల 8,840 రూపాయలు మాత్రమే అందించగలిగారు. 2019 ఖరీఫ్‌లో 1,61,653 మంది రైతులకు 171 కోట్ల 65 లక్షల 48,439 రూపాయలు అందించేందుకు రంగం సిద్ధం చేయగా 1,47,583 మంది రైతులకు 150 కోట్ల 38 లక్షల 55,712 రూపాయలు అందించారు. అదే సంవత్సరం రబీలో 1,48,264 మంది రైతులకు 155 కోట్ల 16 లక్షల 31,489 రూపాయలు పెట్టుబడిగా సాయంగా అందించాలని నిర్ణయించగా 1,18,625 మంది రైతులకు 111 కోట్ల 6 లక్షల 10,153 రూపాయలు బ్యాంకుల్లో జమ చేయగలిగారు. 2020 వానాకాలంలో 1,72,787 మంది రైతులకు 177 కోట్ల 9 లక్షల 66,041 రూపాయలు పెట్టుబడి సాయంగా ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించారు. జూన్‌లో 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందజేశారు. బ్యాంకు ఖాతాలు, పట్టాదారు పాసుపుస్తకాల అప్‌డేషన్‌, తదితర కారణాల వల్ల 1,65,425 మంది రైతులకు 173 కోట్ల 75 లక్షల 76 వేల 8 రూపాయలు ఖాతాల్లో జమయ్యాయి. రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి గడిచిన ఐదు వ్యవసాయ సీజన్లలో 759 కోట్ల 7 లక్షల ఒక వెయ్యి 419 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా 675 కోట్ల 78 లక్షల 59,133 రూపాయలు వారివారి ఖాతాల్లో జమచేశారు. ఈ యాసంగి సీజన్‌లో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అటు వ్యవసాయశాఖకు, ఇటు బ్యాంకు అధికారులకు, పట్టాదారు పుస్తకాల జారీ విషయంలో జాప్యం లేకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని 1,76,138 మంది రైతులందరికి యాసంగి పెట్టుబడి సాయం మూడు, నాలుగు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు. 

నియంత్రిత సాగు విధానం రద్దు

రాష్ట్రంలో గత వానాకాలం నుంచి అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని సమాచారం. ఇక నుంచి రైతులు ఏ పంట వేసుకోవాలనే విషయాన్ని ప్రభుత్వం సూచించదని, రైతులు వారి వారి నిర్ణయాల మేరకే పంటలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవడానికి వీలున్నందున ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా పంటలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ యాసంగి సీజన్‌ పంటను అమ్ముకునేందుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండదని సమాచారం.


Updated Date - 2020-12-28T04:31:38+05:30 IST