అతలాకుతలం..లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2020-08-16T10:55:45+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. సగటున 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది

అతలాకుతలం..లోతట్టు ప్రాంతాలు జలమయం

జిల్లావ్యాప్తంగా 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు 

నిండిన చెరువులు, కుంటలు 

నీటి మునిగిన పంట చేలు


కరీంనగర్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. సగటున 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుజురాబాద్‌ మండలంలో అత్యధికంగా 19.5, రామడుగు మండలంలో  అత్యల్పంగా 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిగురుమామిడి మండలంలో 18.1, సైదాపూర్‌లో 16.6, జమ్మికుంటలో 15.1, ఇల్లందకుంటలో 14.8, శంకరపట్నంలో 14.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లోని మండలాల్లో సగటున 15 సెంటీ మీటర్ల వర్షం కురువగా కరీంనగర్‌ రెవెన్యూ డివిజన్‌లో 8.2 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. భారీగా కురిసిన వర్షానికి జిల్లాలోని చెరువులు, కుంటలు అన్ని నిండి మత్తళ్లు పడ్డాయి. పలు చోట్ల చెరువులు, కుంటలు పొంగిపొర్లడంతో కట్టలు తెగిపోయే ప్రమాదముందని, మత్తళ్లు తొలగించారు. భారీగా కురిసిన వర్షాలకు వరి, పత్తి, జొన్న చేలు నీట మునిగిపోయాయి. పలువాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. గన్నేరువరం మండలం ఇల్లంతకుంట పొత్తూరు గ్రామాల మధ్య బిక్కవాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి వాగు పొంగింది.


వీణవంక మండలం నర్సింగాపూర్‌ గ్రామం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో జమ్మికుంట కరీంనగర్‌ మార్గంలో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి రేకొండ మధ్య బ్రిడ్జి కూలిపోయింది హుజురాబాద్‌ మండలం చెల్పూరు గ్రామంలో చిన్నచెరువు, పెద్ద చెరువు నిండి పొంగిపొర్లడంతో ఆ చెరువుల మత్తళ్లను తొలగించారు.  సైదాపూర్‌ మండలంలో  అన్ని చెరువులు మత్తళ్లు పడుతుండడంతో రోడ్లపై నుంచి నీరు ప్రవహించి పలు బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. ఎల్లంపల్లిలో శుక్రవారం రాత్రి ఇల్లు కూలి ఒకరికి గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం రాజాపూర్‌ గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కేశవపట్నంలో మేకల రాజవీరు అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. కన్నాపూర్‌లో అడితం రాజయ్య, జమ్మికుంట మండలం గోపాల్‌పూర్‌ గ్రామంలో సాంభయ్య అనే వ్యక్తి ఇళ్లు కూలిపోయాయి. తిమ్మాపూర్‌ మండలంలో 10 ఇళ్లు కూలిపోగా, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 80 మంది రైతులకు చెందిన 115 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కరీంనగర్‌లో పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.

Updated Date - 2020-08-16T10:55:45+05:30 IST