జల‘సిరి’సిల్ల

ABN , First Publish Date - 2020-09-21T06:09:57+05:30 IST

కాళేశ్వరం జలాలు, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో మెట్ట ప్రాంతమైన జిల్లా జల

జల‘సిరి’సిల్ల

నిండుకుండుల్లా ప్రాజెక్ట్‌లు, చెరువులు 

మిడ్‌ మానేరులో 25 టీఎంసీల నీరు 

మానేరు, మూలవాగులో జల సవ్వడి

పునాస పంటలకు పుష్కలంగా నీరు 

సాధారణం కంటే అధికంగా వర్షపాతం

సాధారణం 684.9 మిల్లీమీటర్లు, కురిసింది 1093.4

ఉబికి వస్తున్న భూగర్భ జలాలు 

పెరిగిన సాగు విస్తీర్ణం 

అన్నదాతల హర్షం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కాళేశ్వరం జలాలు, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో మెట్ట ప్రాంతమైన  జిల్లా జల సిరిసిల్లగా మారింది.   ఎప్పుడూ ఎడారిని తలపించే ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ పొంగి పొర్లడంతోపాటు సింగసముద్రం, నిమ్మపల్లి ప్రాజెక్ట్‌, మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నిండుకుండలను తలపిస్తున్నాయి.  సిరిసిల్ల మానేరువాగు, వేములవాడ మూల వాగులో జల ప్రవాహం సవ్వడి చేస్తోంది.  మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లోకి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వస్తున్న వరదకు తోడు మానేరు వాగు ప్రవాహంతో 27.5 టీఎంసీల సామర్థ్యంగల శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లోకి 25.197 టీఎంసీల నీళ్లు చేరాయి. ప్రాజెక్ట్‌ నిండడంతో   కరీంనగర్‌ ఎల్‌ఎండీకి నీటిని వదులుతున్నారు. జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ ప్రాంతాల్లోని చెరువులు మత్తడి దూకుతున్నాయి. గంభీరావుపేటలోని ఎగువ మానేరు, సింగసముద్రానికి సందర్శకుల తాకిడి పెరిగింది. జిల్లాలో ఎటు చూసినా జల సందడి కనిపిస్తోంది. 


పైపైకి పాతాళ గంగ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి వర్షాకాలం ప్రారంభంలో మోస్తరుగా వర్షాలు పడ్డ అల్పపీడన ప్రభావంతో అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావుల జల మట్టం పెరిగింది. గతేడాది ఆగస్టులో  భూగర్భ జలాలు 12.65 మీటర్ల లోతులో ఉంటే ఈ సంవత్సరం ఆగస్టులో 5.54 మీటర్ల పైకి వచ్చాయి. వేములవాడ రూరల్‌ మండలంలో 0.33 లోతులో నీళ్లు ఉండగా వేములవాడ అర్బన్‌లో 11.65 మీటర్ల లోతులో ఉన్నాయి. జిల్లాలో అనేక మండలాల్లో వాటర్‌ లెవల్‌  పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో 684.9 మిల్లీ మీటర్ల వర్షానికి 1093.4 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువగా ఉంది. వేములవాడ రూరల్‌, బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. చందుర్తి, కోనరావుపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, మండలాల్లో అధిక వర్షపాతం, రుద్రంగిలో సాధారణ వర్షపాతం నమోదైంది. 


పెరిగిన సాగు 

భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వానాకాలం పంటల సాగును పెంచుకున్నారు. జిల్లాలో 2,47,608 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 1,37,525 ఎకరాలు, పత్తి 97,839 ఎకరాలు, మొక్కజొన్న 470 ఎకరాలు, కంది 10,306 ఎకరాలు, పెసర 1,196 ఎకరాలు, ఇతరాలు 212 ఎకరాలు సాగు చేశారు. వర్షాలు అశాజనకంగా కురుస్తుండడంతో  సాగులో దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. 


అధిక వర్షాలతో నష్టం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధిక వర్షాలు జలకళను తెచ్చినా పంటలు నీట మునుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.  అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నష్టపోవాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. 


జిల్లాలో పెరిగిన భూగర్భజలాల వివరాలు (మీటర్లలో)

మండలం ఆగస్టు(2019) ఆగస్టు (2020)

బోయినపల్లి 6.61 1.00

చందుర్తి 4.99 0.36

గంభీరావుపేట 12.68 7.57

ఇల్లంతకుంట 12.45 3.49

కోనరావుపేట 12.71 5.79

ముస్తాబాద్‌ 21.50 7.48

రుద్రంగి 12.78 5.38

సిరిసిల్ల 15.81 10.77

తంగళ్లపల్లి 9.30 3.02

వీర్నపల్లి 4.91 5.04

వేములవాడ రూరల్‌ 3.45 0.35

వేములవాడ 23.19 11.65

ఎల్లారెడ్డిపేట 17.69 10.02


జిల్లా సగటున    12.65 5.54

Updated Date - 2020-09-21T06:09:57+05:30 IST