ఉధృతంగా కరోనా

ABN , First Publish Date - 2020-06-26T10:29:37+05:30 IST

కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతున్నది. జిల్లాలో గురువారం 12 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ప్రజలకు కలవరం కలిగిస్తున్నది

ఉధృతంగా కరోనా

ఒకే రోజు 12 మందికి పాజిటివ్‌

84కు చేరిన కేసుల సంఖ్య 

జిల్లాలో భయం..భయం


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతున్నది. జిల్లాలో గురువారం 12 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ప్రజలకు కలవరం కలిగిస్తున్నది. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత జూన్‌ 5 నుంచి పాజిటివ్‌ కేసుల నమోదు ఆగకుండా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌ విధించక ముందే జిల్లాలో మార్చి 17న తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగిసే సరికి ఆ సంఖ్య 23కు చేరింది. మళ్లీ జూన్‌ 5 నుంచి మొదలై 21 రోజుల్లోనే 61 పాజిటివ్‌ కేసులు నమోదై ప్రజల్లో భయాందోళనలు రేకేత్తిస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతూ పోతున్నారు.


హూజూరాబాద్‌ రెవె న్యూ డివిజన్‌లో కరోనా వ్యాధి విజృంభించడంతోపాటు ఇప్పటికే ముగ్గురు ఆ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలకు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం హుజూరాబాద్‌  డివిజన్‌లో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీణవంక మండలం వల్బాపూర్‌ గ్రామంలో చెన్నయ్‌ నుంచి తిరిగి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా వ్యాధి సోకగా ప్రస్తుతం ఆయన సమీపబంధువులు ముగ్గురికి, ఆయన ఇంటి సమీపంలోని మరొకరికి కరోనా వ్యాధి సోకింది. మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చిన జమ్మికుంట పత్తి వ్యాపారి భార్యకు కూడా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది.


హుజురాబాద్‌లో ఇప్పటికే వ్యాధి సోకి చికిత్స పొందుతున్న బ్యాంకు ఉద్యోగి సమీప బంధువులు మరో ముగ్గురికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. హుజూరాబాద్‌ పట్టణంలో ఒక రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి (72)అనారోగ్యంతో పలు ఆసుపత్రులు తిరుగగా ఆయనకు కరోనా వ్యాధి సోకింది. కరీంనగర్‌ సరస్వతీనగర్‌కు చెందిన ఒక వ్యక్తితోపాటు 18 నెలల బాబుకు కూడా వ్యాధి నిర్ధారణ అయింది. పెద్దపల్లికి చెందిన ఒక వ్యక్తి కరోనా వ్యాధి బారిన పడి మరణించగా వీరూ అతని కుటుంబసభ్యులేనని తెలిసింది. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో భీవండి నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.  రెండు రోజులుగా జిల్లాలో తీసిన శాంపిల్స్‌లో మరో 250 మందికి సంబంధించిన రిపోర్టులు రావలసి ఉన్నది. ఒకే రోజు 12 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆ శాంపిల్స్‌లో ఇంకా ఎంత మందికి వచ్చే అవకాశముందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. 


హుజూరాబాద్‌ డివిజన్‌లో పరిస్థితి తీవ్రం

హుజురాబాద్‌ డివిజన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. జూన్‌ 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ డివిజన్‌లోని హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండల్లాలో 35 మందికి వ్యాధి సోకగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇందులో జమ్మికుంట బ్యాంకు మేనేజర్‌కు కరోనా వ్యాధి రాగా ఆయన లింక్‌లో 12 మందికి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లింక్‌లో 9 మందికి వ్యాధి సోకింది. మరణించిన టాక్సీ డ్రైవర్‌ లింకులో 23 కేసులు నమోదయ్యాయి.  జిల్లావ్యాప్తంగా 84 కేసులు నమోదు కాగా వీరిలో ముగ్గురు మరణించారు. 30 మంది ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకొని డిశ్చారి కాగా 51 మంది హైదరాబాద్‌ గాంధీ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో, కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 20 మందికి పైగా హోంక్వారంటైన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-06-26T10:29:37+05:30 IST