ఫలం..విషతుల్యం
ABN , First Publish Date - 2020-05-24T11:02:19+05:30 IST
సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన పండ్లను వ్యాపారులు ముం దుగానే పండిస్తున్నారు. అరటి కాయ నుంచి మామిడి కాయల వరకు కార్బైడ్

కార్బైడ్‌తో పండుతున్న మామిడి
నిషేధించిన యథేచ్ఛగా వాడకం
వ్యాధుల బారిన జనం
జిల్లాలో కరువైన నిఘా
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన పండ్లను వ్యాపారులు ముం దుగానే పండిస్తున్నారు. అరటి కాయ నుంచి మామిడి కాయల వరకు కార్బైడ్ వంటి రసాయనాలతో విషం నింపుతున్నారు. ప్రజలఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పండ్లు తినాలంటే రోగాలు ‘కొని’తెచ్చుకునే పరిస్థితి సృష్టిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక మండీలను ఏర్పాటు చేసి మామిడిని కాల్షియం కార్బైడ్‌తో మాగబెడుతూ వివిధ మండలాలకు సరఫరా చేస్తున్నారు. మామిడి తోటల నుంచి వచ్చే పం డ్లతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పండ్లను దిగుమతి చేసుకొని రసా యనాలతో మాగబెడుతున్నారు. ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్బైడ్‌తో మాగబెట్టిన మామిడి పండ్లు మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్నాయి.
కార్బైడ్‌తో అనేక రోగాలు
కార్బైడ్‌తో పండించిన పండ్లు తింటే అల్సర్, కాలేయం, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల వ్యాధులతోపాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహజసిద్ధంగా మాగబెట్టిన మామిడి పండ్లను తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇథైలిన్ గ్యాస్‌పై అవగాహన కరువు
కాల్షియం కార్బైడ్ రసాయనం వినియోగాన్ని హైకోర్టు ఆదేశాలతో అప్పటి ప్రభుత్వం 2012 మార్చిలో నిషేధిచింది. ఐదేళ్లు గడుస్తున్నా కార్బైడ్ వినియోగం మాత్రం ఆగడం లేదు. అధికారులు పట్టించు కోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిషేధిత కార్బైడ్ సరఫరా జరుగుతున్నా రైతులకు అవగాహన కల్పించడంలేదు. కార్బైడ్‌కు బదు లు ఇథైలీన్ గ్యాస్ ద్వారా పండ్లను మాగబెడితే ఆరోగ్యమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మాగబెట్టే గదులను ఉపయోగిం చాలని తెలిపింది. రైఫనింగ్ చాంబర్ల ఏర్పాటు కోసం కేంద్రం 40 శాతం రాయితీ కల్పించింది. ఇథైలిన్ వాడకం రైఫ నింగ్ చాంబర్లఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పించడం లేదు.
ఇథైలిన్తో ఖర్చు ఎక్కువే
రైఫనింగ్ చాంబర్ ద్వారా ఇథైలిన్ గ్యాస్‌ను వదిలి పండ్లను మూడు రోజులు మాగబెడుతారు. దీంతో పండ్లు సహజసిద్ధంగా మాగినట్లు ఉంటాయి. ఇథైలిన్ గ్యాస్ ద్వారా పండ్లు మాగబెట్టడానికి ఒక టన్నుకు రూ.2వేల వరకు ఖర్చవుతోంది. దీంతో రైతులు, వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
పండ్లను గుర్తు పట్టడం ఎలా?
కార్బైడ్ ద్వారా మాగబెట్టిన పండ్లను గుర్తించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మామిడి పండ్లపై ఆకుపచ్చని మచ్చలు ఉంటాయి. పసుపు వర్ణం ఎక్కువ. ఈ పండు తినే సమయంలో నోట్లో కొంచెం మంట ఉంటుంది. కడుపులో నొప్పి, గొంతు నొప్పి, డయేరియా ఉంటే కార్బైడ్ వాడినట్లు గుర్తించాలి. సహజసిద్ధంగా మాగితే అకుపచ్చ, పసుపు రంగులు కలిసినట్టుగా ఉంటాయి. పండును కోసినప్పుడు గుజ్జు ఎరుపు, పసుపు కలిసినట్టుగా ఉంటుంది. పండ్లలో రసం ఎక్కువగా ఉంటుంది. తొడిమ లోపలికి కుంగుతుంది.