పెళ్లిసందడి మొదలైంది..!

ABN , First Publish Date - 2020-11-20T05:20:07+05:30 IST

కొవిడ్‌ నిబంధనల సడలింపుతో పెళ్లిసందడి మొదలైంది.

పెళ్లిసందడి మొదలైంది..!
పెండ్లి ఫొటోలు

మోగనున్న పెళ్లిభాజా

డిసెంబరు 11 వరకు ముహూర్తాలు 

బంగారు, వస్త్ర దుకాణాల్లో రద్దీ 

దొరకని ఫంక్షన్‌హాళ్లు  

ఇళ్ల వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కొవిడ్‌ నిబంధనల సడలింపుతో పెళ్లిసందడి మొదలైంది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిన వివాహాలతోపాటు కొత్తగా నిశ్చయించుకున్నవారు  కార్తీక మాసంలోని ముహూర్తాల్లో  పెళ్లిళ్లు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  కరోనా సమయంలో వెలవెలబోయిన షాపింగ్‌మాళ్లు, దుకాణాలు  కూడా కళకళలాడుతున్నాయి. జిల్లాలోని ఫంక్షన్‌హాళ్లకు డిమాండ్‌ పెరిగింది. మంచి ముహూర్తాల సమయంలో ఫంక్షన్‌హాళ్లు దొరకకపోవడంతో ఇళ్ల వద్దనే పెళ్లిళ్లు చేయడానికి  నిర్ణయించుకుంటున్నారు.  ఆరు నెలల పాటు పనులు లేక ఇబ్బందులు పడ్డవారు బిజీబిజీగా మారిపోయారు. బంగారు, వస్త్ర దుకాణాలు సందడిగా మారాయి. పంతుళ్లు, సన్నాయి మేళంవారికి, వంట మనుషులు, ఫొటో వీడియో గ్రాఫర్లు, పెళ్లి కార్డుల ఫ్రింటింగ్‌, డేకరేషన్‌ పనులు చేసేవారికి ఉపాధి లభించనుంది. 

మంచి ముహూర్తాలు..  

కార్తీక మాసంలోని మంచి ముహూర్తాలతో పెళ్లిళ్లు మొదలయ్యాయి. ఈ సంవత్సరం డిసెంబరు 14 వరకు కార్తీక మాసం ఉంది. ఇందులో నవంబరులో 20, 21, 22, 25, 26, 27, 28, 30 తేదీల్లోని ముహూర్తాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహించనున్నారు. డిసెంబరులో 2, 4, 6, 9, 10, 11 తేద్లీనూ వివాహాలు జరగనున్నాయి. 2021లో జనవరి 6 వరకు ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 13 నుంచి పుష్యమాసంలో గురుమూఢం ఉంటుంది. ఫ్రిబవరి 12 నుంచి మాఘమాసం మొదలై మూఢం కొనసాగుతుందని పంతుళ్లు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ 13న ఉగాదితో ఫ్లవ నామ సంవత్సరం మొదలై మూఢం కొనసాగుతుంది.  మంచి ముహూర్తాలు కావాలంటే ఆరు నెలలపాటు ఆగాల్సిన పరిస్థితి. దీంతో ఈ రెండు నెలల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడుతున్నారు.  

Updated Date - 2020-11-20T05:20:07+05:30 IST