పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మోక్షమెప్పుడో..?

ABN , First Publish Date - 2020-11-13T10:08:17+05:30 IST

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి నాలుగేళ్లయినా మోక్షం లభించడం లేదు. జిల్లాలోని రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణాలు పూర్తి కావడం, ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా, పెద్దపల్లిలో

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మోక్షమెప్పుడో..?

ఎంపిక చేసిన స్థలంపై దేవాదాయ శాఖ అభ్యంతరం

నాలుగేళ్లయినా ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం

ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గ ప్రజలు 


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి నాలుగేళ్లయినా మోక్షం లభించడం లేదు. జిల్లాలోని రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణాలు పూర్తి కావడం, ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా, పెద్దపల్లిలో మాత్రం క్యాంపు కార్యాలయం ఊసే లేకుండాపోయింది. దీంతో సమస్యల నిమిత్తం ఎమ్మెల్యేను కలవాలనుకున్న ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఒక్కో కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం కోటి రూపాయల నిధులను కేటాయించారు. రామగుండం నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అప్పటి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపి శరవేగంగా పూర్తి చేయించారు. అలాగే మంథని నియోజకవర్గ కార్యాలయానికి మంథనిలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ భవనాన్ని 2017లో పూర్తిచేయించారు. ఈ కార్యాలయాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో గెలిచిన కోరుకంటి చందర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు ఆ కార్యాలయాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. 


పెద్దపల్లిలో స్థలం కరువు..

జిల్లా కేంద్రమైన పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం రైల్వే స్టేషన్‌ రోడ్డులోగల గోశాల స్థలాన్ని గుర్తించారు. అలాగే ఎంపీ కార్యాలయానికి కూడా ఇక్కడే స్థలాన్ని గుర్తించారు. ఇది గోశాల స్థలం కావడంతో దేవాదాయ శాఖ అభ్యంతరం చెప్పింది. దీంతో భవన నిర్మాణ పనులను చేపట్టలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొక చోట స్థలాన్ని గుర్తించాల్సి ఉండగా, నాలుగేళ్లయినా ఇప్పటి వరకు స్థలం దొరకకపోవడం విచారకరం.


పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి క్యాంపు కార్యాలయానికి స్థలం దొరకడం లేదా అనే విమర్శలు వస్తున్నాయి. క్యాంపు కార్యాలయం లేక వివిధ సమస్యలపై ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే స్టేషన్‌ రోడ్డులోనే గల తన విద్యాలయంలోనే ఆయన తాత్కాలికంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.


ఈ కార్యాలయంతో పాటు తన నివాసగృహంలో తనను కలిసేందుకు ఎమ్మెల్యే అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆయన విద్యాలయంలో గల కార్యాలయంలోనే అందుబాటులో ఉంటున్నారు. కరోనాకు ముందువరకు విద్యాలయ క్యాంపస్‌ ప్రారంభంలో గల భవనంలోనే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం క్యాంపస్‌ లోపల కార్యాలయంలో అందుబాటులో ఉంటుండడంతో అక్కడికి వచ్చేందుకు ప్రజలు కొంత మేరకు ఇబ్బందులు పడుతున్నారు. గేటు వద్ద ఉండేవాళ్లు అనుమతిస్తే తప్ప లోపలికి వెళ్లే ఆస్కారంలేదు. ఇప్పటికైనా పెద్దపల్లి ఎమ్మెల్యే స్పందించి క్యాంపు కార్యాలయ భవనానికి స్థలాన్ని గుర్తించి త్వరితగతిన పనులు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-13T10:08:17+05:30 IST