బిల్లుల చెల్లింపులు సులభం

ABN , First Publish Date - 2020-12-06T05:40:50+05:30 IST

గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల ప్రక్రియ సులభమైంది.

బిల్లుల చెల్లింపులు సులభం

- డీపీవో పద్దులో జమ విధానం రద్దు

- నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి నిధులు 

- జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు 

- జనాభా ప్రాతిపదికన కేటాయింపు  

- 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.43 కోట్లు మంజూరు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల ప్రక్రియ సులభమైంది.   పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు డీపీవో ద్వారా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసేవారు. దీంతో పనులు జరిగినా వాటి బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమయ్యేది. దీనిని దృష్టిలో పెటుకొని పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే నిధులు జమ చేస్తుండడంతో  పనులు చేసేవారికి ఊరట కలుగుతోంది. 

 

 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.43 కోట్లు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా 4,16,048 మంది జనాభా ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తున్నారు. జిల్లాలో 1000 జనాభా కన్నా తక్కువగా వంద గ్రామ పంచాయతీలు ఉండగా 5 వేల వరకు 148 గ్రామ పంచాయతీలు, 5 వేల జనాభాకు పైగా 7 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి నెలా జనాభా ప్రకారం నిధులు విడుదలవుతున్నాయి. గత నెల ఆర్థిక సంఘం నిధులు రూ.5 కోట్ల 43 లక్షలు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. ఇందులో జనరల్‌ కంపోనెంట్‌ కింద రూ.4,25,70,949 నిధులు రాగా ఎస్సీఎస్పీ కంపోనెంట్‌ కింద రూ.98,31,163, టీఎస్పీ కంపోనెంట్‌ కింద రూ.19,06,995 నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం కేటాయించిన నిధులను వారి ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధులను గ్రామ పంచాయతీ పాలకవర్గం నిబంధనల మేరకు జాప్యం లేకుండా బిల్లులను చెల్లించుకునే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2020-12-06T05:40:50+05:30 IST