నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2020-09-01T07:38:23+05:30 IST

ఎట్టకేలకు మంగళవారం నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభం కానున్నది. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించక

నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

 సవాల్‌గా తీసుకుంటున్న ప్రభుత్వం

సందిగ్ధంతో ఉపాధ్యాయులు

 సమాచారాన్ని సేకరించిన ప్రధానోపాధ్యాయులు 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 31: ఎట్టకేలకు మంగళవారం నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభం కానున్నది.  సెప్టెంబర్‌, అక్టోబర్‌లో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించక పోతే జీరో ఇయర్‌ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యాబోధనను సవాల్‌గా తీసుకున్నది. ఆన్‌లైన్‌ విద్యాబోధనతో పేద, మారుమూల ప్రాంతాల విద్యార్థులు నష్టపోతారని స్పష్టంచేస్తూ హైకోర్టు పలు ప్రశ్నలను సంధించినా వాటికి సమాధానమిస్తూనే ఆ సమస్యలను అధిగమించేందుకు అధికారయంత్రాగాన్ని సమాయత్తం చేసింది.


మొత్తంగా సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి  తెలుగు మీడియంలో మూడు నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీవీ దూరదర్శన్‌, టీషాట్‌ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్‌ విద్యను బోధించేందుకు ప్రణాళికను రూపొందించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 


 టీవీ లేనివారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

జిల్లాలో 649 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా జిల్లాలో టీవీ సౌకర్యం లేని 1,920 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం తీసుకుంటున్నారు. విద్యార్థులు లేకుండా ఇప్పటికే పాఠశాలలను ప్రారంభించగా ఆన్‌లైన్‌ విద్యాబోధనతో మంగళవారం నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు.


సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా టీచింగ్‌ క్లాస్‌ నిర్వహణను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు ప్రభుత్వం టైంటేబుల్‌ను జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీవీ చానళ్ల ద్వారా విద్యార్థులకు వారానికి ఒక సబ్జెక్టులో ఒక క్లాసు చొప్పున నెలకు నాలుగు క్లాస్‌లను బోదించనున్నారు. ఈ టైంటేబుల్‌ వివరాలను ఇప్పటికే ఉపాధ్యాయులు విద్యార్థులకు చేరవేసి మంగళవారం నుంచి క్లాస్‌లను ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలని, ఏమైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్ట్‌ టీచర్‌తో నివృత్త చేసుకోవాలంటూ సమాచారాన్ని విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు చేరవేశారు. 


 సమస్యలను అధిగమించేదెలా..

విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుసంధాన కర్తగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు సమాచారమివ్వడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. అనేక సమస్యలు, సవాళ్ళు ఇటు విద్యార్ధులు, ఉపాధ్యాయులు, అధికారులను కలవరపెడుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారిలో మెజార్టీ విద్యార్థులు పేద, మధ్యతరగతి వారే కావడం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో అనేక మందికి టీవీ, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో లేవు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వయంగా బోధిస్తేనే అంతంత మాత్రంగా చదువుకునే మూడవ, నాలుగు, ఐదో తరగతి విద్యార్థులు టీవీల్లో చెప్పే పాఠాలను ఎలా అర్థం చేసుకుంటారో తెలియడం లేదు.

 

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: కరోనా వైరస్‌ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. 170 రోజుల తర్వాత అంటే దాదాపు ఆరు నెలలుగా మూసి ఉన్న విద్యాలయాలు తెరుచుకున్నాయి. తరగతి గదిలో రూపుదిద్దుకోవాల్సిన విద్యార్థుల జీవితాలు ఆన్‌లైన్‌లో అక్షరాలు దిద్దే పరిస్థితి ఏర్పడింది. టీ-శాట్‌, టీ-నిపుణ ద్వారా ఆన్‌లైన్‌లో చదువులు నేర్పాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అరకొర వసతులతో ఆన్‌లైన్‌లో బోధన సాధ్యం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఓవైపు కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 లో భాగంగా కేవలం 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరు కావడంతో పాటు సెప్టెంబరు 21 నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. ఆగస్టు 27నే పాఠశాలలు తెరుచుకోగా, ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.


ప్రభుత్వ పాఠశాలల్లో 70 వేల మంది విద్యార్థులు

జగిత్యాల జిల్లాలో 861 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 511 ప్రాథమిక పాఠశాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలలు, 214 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 3,292 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 70 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు అందించేందుకు నాలుగు రోజుల నుంచి ఏర్పాట్లు సాగుతున్నా..


విద్యాబోధన ఎలా సాగుతుందనేదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. జిల్లాలో 6,398 మంది విద్యార్థులకు డీటీహెచ్‌లు ఉన్నాయని, 38,704 విద్యార్థులకు మొబైల్‌ సౌకర్యం, 35,787 మందికి టీవీలు ఉన్నాయని, 21,003 మందికి ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉండగా, 190 మందికి ల్యాప్‌టాప్‌లు కూడా ఉన్నట్లు ఇటీవల విద్యాశాఖ అధికారుల సర్వేలో తేలింది. టీ-శాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రసారాలు సాగేలా చూడాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ రవి కేబుల్‌ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేయగా, విద్యుత్‌ కొరత ఉండకుండా చూసేందుకు సంబంధిత శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 

సారంగాపూర్‌, బీర్‌పూర్‌, జగిత్యాల, గొల్లపల్లి, పెగడపల్లి, రాయికల్‌, ధర్మపురిలాంటి ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ విద్యా విధానంపై ప్రజాప్రతినిధులు సమీక్షలు జరిపారు.  ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు ఏ మేరకు సక్సెస్‌ అవుతాయోనని చూడాలి. 


కరోనా బారిన ఉపాధ్యాయులు

జిల్లాలో ఇప్పటికీ 50 మందికి పైగా ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. వారంతా పాఠశాలలకు దూరంగానే ఉంటున్నారు. మరో వైపు పల్లెలకు ఉపాధ్యాయులు రావడంపైనా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఇప్పటికీ ముగ్గురు కరోనా బారిన పడ్డారు. దీంతో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నాలుగైదు రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు.


మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌ రాగా, పాఠశాలకు వెళ్లేందుకే ఉపాధ్యాయులు జంకుతున్నారు. అలాగే జగిత్యాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓ మహిళా టీచర్‌కు పాజిటివ్‌ రాగా, అందులో పనిచేసే 20 మంది టీచర్లు ఇప్పుడు కలవరపడుతున్నారు. నిజానికి ఆన్‌లైన్‌లో జరిగే తరగతులను ఉపాధ్యాయులు ఇంటి నుంచే పర్యవేక్షించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం వారిని పాఠశాలకు రావాలని నిబంధన పెట్టడంపై ఇటు ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.  


Updated Date - 2020-09-01T07:38:23+05:30 IST