వంద శాతం దిశగా ‘భూప్రక్షాళన’

ABN , First Publish Date - 2020-09-01T07:27:54+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం జిల్లాలో వంద

వంద శాతం దిశగా ‘భూప్రక్షాళన’

 పెండింగు సమస్యలకు పరిష్కారం

 పది మండలాల్లో  భూరికార్డుల శుద్ధీకరణ పూర్తి


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం జిల్లాలో వంద శాతం పూర్తి కావస్తున్నది. పెండింగులో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ  ఆరు మాసాల నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారు. ఇక నుంచి భూ సమస్యల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పనులు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న అదనపు కలెక్టర్‌ వేగంగా పనులను పూర్తి చేయిస్తున్నారు. మంథని, పాలకుర్తి, అంతర్గాం మండలాలు మినహా అన్ని మండలాల్లో వందకు వంద శాతం భూ రికార్డులను శుద్ధి చేశారు.


జిల్లాలో 1,86,667 రెవెన్యూ ఖాతాలు ఉండగా, వీటి పరిధిలో 4,99.646 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో పట్టాదారులకు చెందిన భూములే గాకుండా ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. 2015లో భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూములు కలిగి ఉన్న వారందరినీ నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు తీసుకుని ధరణి వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేశారు. వాటి ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. వివాదస్పదంగా ఉన్న భూములకు సంబంధించిన భూములకు పట్టాలను జారీ చేయలేదు.


భూ రికార్డుల శుద్ధీకరణ సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకాల్లో పలు తప్పులు దొర్లాయి.  కొన్ని ఖాతాలు, సర్వే నంబర్లను ఎవరి పేరు మీద పట్టాలు ఇవ్వకుండా పెండింగులో పెట్టారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మూడు సంవత్సరాలుగా బాధితులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఏడాది కాలం పాటు ఎన్నికలు జరగడంతో మరింత పెండింగులో పడ్డాయి. 


అదనపు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ..

జిల్లాకు ఆరు మాసాల క్రితం అదనపు జిల్లా కలెక్టర్‌గా వచ్చిన లక్ష్మీనారాయణ భూ రికార్డుల శుద్ధీకరణపై దృష్టి సారించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 80 శాతానికి పైగా భూ సంబంధిత సమస్యలపైనే దరఖాస్తులు వచ్చాయి. గడిచిన ఆరు మాసాల్లో 1,081 దరఖాస్తులు భూములకు సంబంధించినవే రావడం గమనార్హం. ఇవేగాకుండా పెండింగులో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేసేందుకు చేయాల్సిన డిజిటల్‌ సంతకాలను వేగంగా చేయించారు. అలాగే పెండింగులో ఉన్న ఖాతాలు, సర్వే నంబర్ల వారీగా పరిశీలించేందుకు కార్యాచరణ రూపొందించారు.


1,26,000 సర్వే నంబర్లకు సంబంధించిన 86 వేల ఎకరాల భూముల సమస్యలు పెండింగులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో రోజుకు ఒక 10 సర్వే నంబర్లను పరిశీలించే బాధ్యతను వీఆర్‌ఓలు, ఆర్‌ఐలకు అప్పగించారు. వాటిపై నివేదికలను అదే రోజు డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌లకు అందజేయాలని ఆదేశించారు. ఆ మేరకు సర్వే నంబర్ల వారీగా పెండింగులో ఉన్న వాటిని పరిష్కరిస్తూ వచ్చారు.


సివిల్‌ కోర్టు, హైకోర్టు, జేసీ, ఆర్‌డీఓ కోర్టుల్లో ఉన్న సమస్యలు మినహా రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా నోటీసులు జారీ చేసి పరిష్కరించారు. జూన్‌ 16 వరకు 30 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో వారికి వానా కాలం పంటకు గాను రైతుబంధు సాయం కూడా అందింది. ఇప్పటి వరకు ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, కమాన్‌పూర్‌, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, ముత్తారం మండలాల భూముల సమస్యలు పరిష్కారమయ్యాయి. రెండు, మూడు రోజుల్లో మిగిలిన భూములను పరిష్కరించి జిల్లాను భూ సమస్యల రహిత జిల్లాగా తీర్చిదిద్దనున్నారు. 


 భూ సమస్యలరహిత మండలాలుగా సుల్తానాబాద్‌, పెద్దపల్లి, రామగిరి

సుల్తానాబాద్‌/పెద్దపల్లి/రామగిరి: సుల్తానాబాద్‌, పెద్దపల్లి, రామగిరి మండలాలను భూసమస్యల రహిత మండలాలుగా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ సో మవారం ప్రకటించారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి, రా మగిరి తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో అధికారులు ఇచ్చిన నివేదికల మేరకు అయన సుల్తానాబాద్‌, పెద్దపల్లి, రామగిరిలను భూ సమస్యలు లేని మండలాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను అభినందించారు. ఆయన వెంట డీఆర్‌వో నరసింహమూర్తి, ఆర్డీవోలు శంకర్‌కుమార్‌, క్రిష్ణవేణి, తహసీల్దార్‌లు హన్మంతరా వు, శ్రీనివాస్‌, పుష్పలత ఉన్నారు.


 భూ సమస్యల రహిత జిల్లాగా ప్రకటించడమే లక్ష్యం

 అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ

జిల్లాను భూ సమస్యల రహిత జిల్లాగా ప్రకటించడమే లక్ష్యం. జిల్లా వ్యాప్తంగా 1.26 లక్షల సర్వే నంబర్లలో 86 వేల ఎకరాల భూముల సమస్యలు పెండింగులో ఉన్నట్లు గుర్తించాం. వాటిని ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. రెండు రోజుల్లో లక్ష్యాన్ని అధిగమిస్తాం. ఈ కార్యక్రమం వల్ల కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు భూ సమస్యలపై ఒక అవగాహన వచ్చింది. సమష్టిగా పని చేయడం వల్ల త్వరితగతిన సమ్యలను పరిష్కరించగలిగాం.


Updated Date - 2020-09-01T07:27:54+05:30 IST