కరోనా కలకలం..
ABN , First Publish Date - 2020-06-25T10:25:25+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండడంతో వైరస్‌ను కట్టడి చేయడం సాధ్యమేనా, కాదా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కరోనా సోకిన వారందరినీ

జిల్లాలో ఒకేరోజు ఏడుగురికి పాజిటివ్
ఆందోళన రేపుతున్న హోం క్వారంటైన్
ఆసుపత్రిలో ఐసోలేషన్ కూడా చేయని అధికారులు
వణికిపోతున్న కరోనా బాధితులు, ప్రజలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండడంతో వైరస్‌ను కట్టడి చేయడం సాధ్యమేనా, కాదా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కరోనా సోకిన వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడం గానీ, కనీసం ఐసోలేషన్ కేంద్రానికి గానీ తరలించకుండా ఇళ్లళ్లలో హోం ఐసోలేషన్ చేస్తుండడంతో జిల్లాలో వైరస్ మరింత వ్యాప్తి చెందవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుల్తానాబాద్‌లో గల టీబీ ఆసుపత్రిని ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లా అధికార యంత్రాంగం అక్కడ విధులను నిర్వహించేందుకు 30 మంది డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, పలువురు సిబ్బంది డిప్యూటేషన్ వేశారు. వారి సేవలను ఉపయేగించుకునే స్థితిలో లేకపోవడం గమనార్హం. కేవలం అనుమానితులను మాత్రమే ఈ కేంద్రానికి తీసుక వచ్చి పరీక్షల ఫలితాలు వెల్లడైన తర్వాత ఇంటికి పంపిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా పాజిటివ్ వచ్చిన వారందరినీ ఇళ్లకు పంపించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటికి పంపిస్తున్నారు. అయితే కరోనా సోకిన వారిలో అత్యధిక మంది గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు.
బుధవారం ఒక్కరోజే రామగుండంలో ఇద్దరు కరోనా బాధిత కుటుంబాల్లోని ఆరుగురికి, ఒక డాక్టర్‌కు కరోనా వైరస్ రావడం అందరినీ వణికిస్తున్నది. ఇప్పటి వరకు నలుగురైదుగురు సింగరేణి కార్మికులకు వైరస్ సోకింది. బుధవారం వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని డాక్టర్లు వారికి సమాచారం ఇచ్చారు. అలాగే సుల్తానాబాద్‌కు చెందిన వీఆర్‌ఏతో పాటు అతడి కుటుంబ సభ్యులు నలుగురికి, ముంబాయి నుంచి వలస వచ్చిన వ్యక్తిని, కల్వచర్లకు చెందిన కదంబాపూర్ వీఆర్‌ఓకు కరోనా సోకగా వారిని కూడా హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. వృద్ధులు, పిల్లలు ఉన్నరని తెలిసి కూడా జిల్లా అధికార యంత్రాంగం నిబంధనల పేరుతో ఆసుపత్రులకు తరలించకుండా ఇంట్లోనే ఉంచడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టడమేమో గానీ మరింత వ్యాప్తి చెందే ప్రమాదమేర్పడింది. సింగరేణి ప్రాంతానికి చెందిన కార్మికులు ఉండే క్వార్టర్లు చాలా చిన్నగా ఉంటాయి.
రెండు బాధిత కుటుంబాల్లో ఆరుగురికి వైరస్ వస్తే వారిని ఇంట్లోనే ఉండాలని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వారికి ఆహారం, కిరాణ సరుకులు, పాలు, పెరుగు, కూరగాయలు ఎవరు సరఫరా చేయాలి. వారే గాకుండా వారు నివాసం ఉండే వీధికి చెందిన వారు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలిస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రానికి గానీ, ఇతర ఆసుపత్రులకు గానీ తరలించడం లేదు. వృద్ధులు, 8 మాసాల పాప కూడా వైరస్ సోకిన వారిలో ఉన్నారు. వారిని కూడా ఇంట్లోనే ఐసోలేషన్ చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం తేరుకుని పాజిటివ్ వచ్చిన వారందనికి హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు.