నులి వెచ్చదనం
ABN , First Publish Date - 2020-12-02T05:28:00+05:30 IST
చలికాలం మొదలయిందంటేనే రోడ్డు పక్కన నూలు వస్త్రాల ప్రత్యేక దుకాణాలు ప్రత్యక్షం అవుతాయి.

- మొదలైన జర్కీన్‌లు, స్వెటర్ల అమ్మకాలు
- ముచ్చటగా మూడు నెలల వ్యాపారం
- జిల్లాకు వచ్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ వ్యాపారులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
చలికాలం మొదలయిందంటేనే రోడ్డు పక్కన నూలు వస్త్రాల ప్రత్యేక దుకాణాలు ప్రత్యక్షం అవుతాయి. మూడు నెలల పాటు సాగే వ్యాపారానికి రాజస్థాన్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వ్యాపారులు తరలివస్తారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వ్యాపారులు జిల్లా కేంద్రంలో సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారి వెంబడి, వేములవాడ పట్టణంలో దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. చలికాలంలో వెచ్చదనాన్ని పొందడానికి ఉపయోగించే మంకీ క్యాప్‌లు, సాక్స్‌లు, జర్కీన్‌లు, స్వెటర్‌లు, టోపీలు, మప్లర్లతో అమ్మకాలు మొదలయ్యాయి. ఏడాదిలోనే కేవలం ఈ మూడు నెలలల్లోనే చలికి తప్పనిసరిగా వాడే దుస్తులు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ స్వెటర్లు కొనుగోలు చేస్తుంటారు. ఉన్నితో తయారుచేసిన దుస్తుల కొనుగోలుకు ఇష్టపడుతారు.
ఆకర్షణీయమైన రంగుల్లో..
ఈ సారి ధరలు కొంత పెరిగినా ఆకర్షణీయమైన రంగుల్లో స్వెటర్లు అమ్మకాలకు ఉంచారు. చిన్నపిల్లల క్యాపులు రూ. 50 నుంచి రూ. 75 వరకు, సాక్స్‌లు రూ. 25 నుంచి రూ. 75 వరకు, జర్కీన్‌లు రూ. 100 నుంచి రూ. 700 వరకు, పెద్దలకు స్వెటర్లు రూ. 200 నుంచి రూ. 1000 వరకు టోపీలు రూ. 50 నుంచి రూ. 100 వరకు, జర్కీన్‌లు రూ. 500 నుంచి రూ. 1500 వరకు, చెవుల క్యాపులు రూ. 50 నుంచి రూ. 100 వరకు, మహిళల క్యాపులు రూ. 30 నుంచి రూ. 110 వరకు, మప్లరు రూ. 75 నుంచి రూ 100 వరకు లభిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ నుంచి వచ్చాం...
- ప్రకాష్‌రాథోడ్, వ్యాపారి మధ్యప్రదేశ్
ప్రతి సంవత్సరం మధ్యప్రదేశ్‌నుంచి స్వెట్టర్లు అమ్మడానికి వస్తాం, మూడు నెలల పాటు ఇక్కడే ఉంటాం. స్వెట్టర్ల అమ్మకంతో ఉపాధి పొందుతున్నాం. సిరిసిల్ల, వేములవాడలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాం.