కొత్తకొత్తగా..నెలరోజుల్లో అమల్లోకి నూతన రెవెన్యూ చట్టం
ABN , First Publish Date - 2020-09-16T06:09:36+05:30 IST
ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ చట్టంలో చేర్పులు, మార్పులు చేసి, వీఆర్‌ఓ వ్యవస్థను రద్దుచేసి నూతన చట్టాన్ని తీసుకవచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో మరిన్ని

త్వరలో తహసీల్దార్, ఆర్‌డీఓల బదిలీలు..
జిల్లాలో పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఇద్దరు తహసీల్దార్లు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ చట్టంలో చేర్పులు, మార్పులు చేసి, వీఆర్‌ఓ వ్యవస్థను రద్దుచేసి నూతన చట్టాన్ని తీసుకవచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ప్రస్తుతం ఆయా రెవెన్యూ డివిజన్లలో పనిచేస్తున్న ఆర్‌డిఓలు, మండలాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీచేయాలని యోచిస్తున్నది. నూతన చట్టం అమల్లోకి వచ్చేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశాలుండడంతో ఈలోపు బదిలీలు జరిగే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
క్రయవిక్రయాలన్నీ..
వ్యవసాయ భూముల క్రయవిక్రయాలన్నీ తహసీల్దార్ సమక్షంలో జరిగే విధంగా చట్టంలో మార్పు చేశారు. ఈ భూముల విక్రయాలకు సంబంధించి ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత నిర్ణీత రోజున రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి కూడా ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మ్యూటేషన్ ఏకకాలంలో పూర్తికానున్నాయి. వీటి కోసం కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. వ్యవసాయేతర భూములను సబ్‌రిజిష్ట్రార్లు రిజిష్టర్ చేయనున్నారు. వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి విస్తృత అధికారాలను రద్దు చేశారు.
పాత రెవెన్యూ చట్టం ప్రకారం మండల తహసీల్దార్, ఆర్‌డీఓ, జేసీ కోర్టుల్లో వివాదస్పద భూములపై బాధితులు అప్పీలు చేసుకునే అవకాశం ఉండగా, వాటిని కూడా రద్దు చేశారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న కేసులను జిల్లాల్లో ఏర్పాటుచేసే ప్రత్యేక ట్రిబ్యూనళ్ల ద్వారా పరిష్కరించనున్నారు. కొత్తగా ఏమైనా వివాదాలు తలెత్తినట్లయితే సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిందే. దీంతో తహసీల్దార్లు, ఆర్‌డీఓలు, జేసీలకు ఉన్నటువంటి మెజిస్ట్రేట్ అధికారాలు ఇక నుంచి ఉండవని తెలుస్తున్నది. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు వీలుగా కంప్యూటర్లు, ఫర్నీచర్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేసేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని అంటున్నారు. ధరణి వెబ్‌సైట్‌ను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకరావాల్సి ఉన్నది.
బదిలీలకు ఆస్కారం..
కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలుచేసే సమయానికి ఆయా మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు, డివిజన్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఆర్‌డీఓలను బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు అనుకుంటున్నారు. గత నెలలో ప్రభుత్వం పలువురి తహసీల్లార్లను బదిలీచేయగా, జిల్లాలోని సుల్తానాబాద్ తహసీల్దార్ హన్మంతరావును మంచిర్యాల జిల్లాకు, జూలపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావును కరీంనగర్ జిల్లాకు బదిలీ చేశారు. వీరి స్థానాల్లో మంచిర్యాల నుంచి బి దత్తప్రసాద్, కరీంనగర్ జిల్లా నుంచి కె రమేష్ బదిలీపై జిల్లాకు వచ్చారు. 15 రోజులైనా ఇప్పటివరకు వీరికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదు. సుల్తానాబాద్, జూలపల్లి మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లకే ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. నూతన చట్టం తీసుకవచ్చిన నేపథ్యంలో వీరికి పోస్టింగులు ఇవ్వలేదు. అన్ని మండలాల తహసీల్దార్ల బదిలీలు అవుతాయని పైనుంచి వచ్చిన సమాచారం మేరకు వీరికి పోస్టింగులు ఇవ్వలేదని తెలుస్తున్నది. మరో పదిహేను రోజుల్లో బదిలీలు తప్పవని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.