కొత్త చట్టాలు మేలు చేస్తాయి

ABN , First Publish Date - 2020-12-18T05:09:22+05:30 IST

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఖచ్చితంగా మేలు చేస్తాయని బీజేపీ జాతీయ కిసాన్‌మోర్చ సభ్యులు, జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత జైపాల్‌ రెడ్డి అన్నారు.

కొత్త చట్టాలు మేలు చేస్తాయి
సమావేశంలో మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి

వ్యవసాయంలో నూతన సంస్కరణలు అవసరం

బీజేపీ జాతీయ కిసాన్‌మోర్చ సభ్యుడు, జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత జైపాల్‌ రెడ్డి 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 17: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఖచ్చితంగా మేలు చేస్తాయని బీజేపీ జాతీయ కిసాన్‌మోర్చ సభ్యులు, జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత జైపాల్‌ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణ రావు, కిసాన్‌ మోర్చ జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950లో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు ఎంతమేరకు బాగుపడ్డారో,  లాభం పొందారో అర్థం చేసుకోవాలని సూచించారు. ఆనాడే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు లిబరైజేషన్‌ విధానం తీసుకువస్తే వ్యతిరేకించారని, రైతులు లాభాలు పొందేందుకు నూతన సంస్కరణలు అవసరం లేదా అని జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. నూతన చట్టాలతో పోరాటం చేసే రైతులకు కలిగే నష్టం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాల వల్ల కొంతలో కొంతైనా రైతులకు ఉపయోగం ఉంటుందని జైపాల్‌ రెడ్డి వివరించారు. నాడు దళారీ వ్యవస్థను వ్యతిరేకించిన వారే, నేడు ధర్నాలు చేయడం విడ్డూరం అన్నారు. కేవలం పండించిన పంటకు మాత్రమే అగ్రిమెంట్‌ తప్ప, సదరు రైతు భూమికి కాదని, కొందరు ఈ విషయాన్ని గ్లోబల్‌ ప్రచారం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుల్లో చైతన్యం కలిగించేందుకే ఈ నూతన చట్టాల అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని, రైతుల అపోహలు త్వరలోనే తోలగిస్తామని తెలిపారు. రైతుకు కావల్సిన జీరో వడ్డీ , కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, సాయిల్‌ కార్డులు, పంటల బీమా లాంటి అనేక రైతు ప్రయోజన కార్యక్రమాలు అమలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో అవి రైతులకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన చట్టాలతో ముమ్మాటికీ రైతులకు లాభమేనని జైపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణ రావు, కిసాన్‌ మోర్చ జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీంధర్‌రెడ్డి,  పట్టణ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్‌, నాయకులు జుంబర్తి దివాకర్‌, కాయితి శంకర్‌, ముద్దం రాము, రాజ్‌కుమార్‌, సాయికృష్ణ, నలువాల తిరుపతి, తదితరులున్నారు.   


Updated Date - 2020-12-18T05:09:22+05:30 IST