సమన్వయంతో పని చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:48:43+05:30 IST

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

సమన్వయంతో  పని చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌

గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ రూరల్‌, డిసెంబరు 5: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం హుజూరాబాద్‌ మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఇరుమల్ల రాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సమస్యలపై మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రామాల్లో పింఛన్లు, రేషన్‌ కార్డులు లేని వారందరికి దరఖాస్తు చేసుకుంటే అందజేస్తామన్నారు. గ్రామాల్లో సొంత స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం ఇళ్లు కట్టించే ఆలోచనలో ఉందన్నారు. అసలైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా త్వరలో అందజేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా దగ్గర పడ్డాయని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతుబంధు పేరిట 15 వేల కోట్ల రూపాయలు రైతులకు అందజేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సఫాయి కార్మికులకు జీతాలు అందక ఇబ్బందులు పడేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాగానే సఫాయి కార్మికులకు నెల నెల జీతాలు అందజేస్తుందన్నారు. గ్రామాల్లోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా మెలగాలన్నారు. గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని రంగాపూర్‌, చెల్పూర్‌, శాలపల్లి-ఇందిరానగర్‌ సర్పంచ్‌లు మంత్రి ఈటలకు వినతి పత్రం అందజేశారు. అనంతరం 51 మంది లబ్ధిదారులకు 51,05,916 రూపాయల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, తహసీల్దార్‌ బావ్‌సింగ్‌, ఎంపీడీవో కృష్ణప్రసాద్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Read more