-
-
Home » Telangana » Karimnagar » Murder for Land Issue
-
భూతగాదాల్లో ఒకరి హత్య
ABN , First Publish Date - 2020-12-11T04:58:12+05:30 IST
పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ భూమి వద్ద ఉన్న వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన గురువారం శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో చోటు చేసుకుంది.

పాత కక్షలతో గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు వ్యక్తులు
శంకరపట్నం, డిసెంబరు 10: పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ భూమి వద్ద ఉన్న వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన గురువారం శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రాచమల్ల సంపత్ (40) వ్యవసాయ చేసుకుంటూ జీవిస్తున్నాడు. పొలం పక్కనే ఉన్న బొనగిరి ఓదెలు, బొనగిరి జంపయ్యలతో భూ హద్దుల విషయంలో గత రెండు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. పలుసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లారు. సంపత్ వ్యవసాయ భూమి వద్ద పనిచేస్తుండగా అక్కడికి చేరుకున్న ఓదెలు, జంపయ్యలు భూమి విషయంలో ఒకరికి ఒకరు దుషించుకున్నారు. ఈ క్రమంలోనే ఓదెలు, జంపయ్యలు గొడ్డలి, ఇనుప రాడ్, కర్రలతో విచక్షణ రహితంగా సంపత్ తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఓదెలు, జంపయ్యలు అక్కడి నుంచి పరారయ్యారు. సంపత్ హత్య జరిగిందని తెలుసుకున్న భార్య రజిత హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. విషయం తెలుసుకున్న లాండ్ అడర్ డీసీపీ శ్రీనివాస్, హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐలు కిరణ్, రాములు, సృజన్‌రెడ్డి, ఎస్‌ఐలు రవి, ప్రశాంత్‌రావు, కిరణ్‌రెడ్డి, సతీష్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంపత్ భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.