మున్సిపల్‌ వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక షెడ్‌

ABN , First Publish Date - 2020-11-20T05:23:06+05:30 IST

నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు రూ.40 లక్షల వ్యయంతో ప్రత్యేక షెడ్‌ నిర్మాణం చేస్తున్నామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.

మున్సిపల్‌ వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక షెడ్‌
పార్కింగ్‌ షెడ్‌ పనులను ప్రారంభిస్తున్న మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి


కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 19: నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు రూ.40 లక్షల వ్యయంతో ప్రత్యేక షెడ్‌ నిర్మాణం చేస్తున్నామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం సప్తగిరికాలనీలోని మున్సిపల్‌ స్థలంలో నిర్మించతలపెట్టిన షెడ్‌ నిర్మాణపనులను కమిషనర్‌ వల్లూరి క్రాంతి, ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ దిండిగాల మహేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలోనే వాహనాలను పార్కింగ్‌ చేస్తుండడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు వాహనాలను నిలిపేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మున్సిపల్‌ సాధారణ నిధులతోపాటు ఆర్థిక సంఘం, సీఎం అస్యూరెన్సు, స్మార్ట్‌సిటీ తదితర నిధుల నుంచి పెద్ద ఎత్తున అధునాతన వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నందున వాటన్నిటినికి ఇక్కడ పార్కింగ్‌ చేయడం కుదరదని, వీటి కోసం ప్రత్యేక షెడ్‌ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. షెడ్‌ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఫ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ మున్సిపల్‌ బాధ్యత..

నగరప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కోటి రూపాయలతో నగరంలోని అన్ని మైదానాల్లో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణాలను చేపడుతున్నామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించనున్న వాకింగ్‌ ట్రాక్‌ పనులను కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేస్తున్నారని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కొన్ని మైదానాల్లో వాకింగ్‌ ట్రాక్స్‌ ఏర్పాటు చేసేందుకు టెండర్లను నిర్వహించి పనులను కూడా ప్రారంభించామని అన్నారు. శాతవాహన యూనివర్శిటీలో, ఎస్సారార్‌ కళాశాల మైదానంలో వాకింగ్‌ ట్రాక్‌తోపాటు సైకిల్‌ ట్రాక్‌ను, 35 ఓపెన్‌ జిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్పొరేటర్లు బండ సుమ, కోటగిరి భూమాగౌడ్‌, కచ్చు రవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T05:23:06+05:30 IST