లింకు కాలువ పనుల్లో మళ్లీ కదలిక

ABN , First Publish Date - 2020-12-15T05:55:27+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని నేరుగా ఎస్సారెస్పీ కాలువలోకి సరఫరా చేసేందుకు వీలుగా చేపట్టిన లింక్‌ కాలువ పనులు మళ్లీ మొదలయ్యాయి.

లింకు కాలువ పనుల్లో మళ్లీ కదలిక
వరద కాలువ నుంచి నీళ్లు వచ్చేందుకు నిర్మించిన తూము

 రూ. 36 కోట్లతో నడుస్తున్న పనులు

 మూడు మాసాల్లో పూర్తయ్యే అవకాశం

 ఎస్సారెస్పీ కాలువల్లోకి నేరుగా కాళేశ్వరం నీరు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని నేరుగా ఎస్సారెస్పీ కాలువలోకి సరఫరా చేసేందుకు వీలుగా చేపట్టిన లింక్‌ కాలువ పనులు మళ్లీ మొదలయ్యాయి. భూ సేకరణలో జాప్యం కారణంగా కొన్ని నెలల పాటు నిలిచిన పనులు నెల రోజుల క్రితం మొదలైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే మార్చి నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లాలోని 1,84,840 ఎకరాల భూములకు సాగు నీరందుతుండగా, ఇందులో డీ-83 ద్వారా 1,04,550 ఎకరాలు, డీ-86 ద్వారా 80,290 ఎకరాలు ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి జిల్లాకు నీళ్లు చేరాలంటే రెండు రోజుల పాటు సమయం పడుతున్నది. దీంతో కాలువ చివరి భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు నేరుగా నీటిని సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కరీంనగర్‌ జిల్లా లక్ష్మీపూర్‌లో గల గాయత్రి పంప్‌ హౌస్‌ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్‌ మానేరుకు వరద కాలువ గుండా కాళేశ్వరం జలాలను తరలించే క్రమంలో మధ్యలో వరద కాలువ నుంచి కాకతీయ ప్రఽధాన కాలువకు నీటిని తరలిస్తే పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు సాగు నీటికి ఢోకా ఉండదని అధికారులు భావించారు. ఇందుకు గాను కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి మీదుగా ఉన్న వరద కాలువ నుంచి జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి వద్ద గల కాకతీయ కాలువ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర మూడు వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యం గల కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ కాలువ నిర్మాణానికి, భూసేకరణకు కలుపుకుని 36 కోట్ల నిధులను ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం మంజూరు చేసింది. 

2019 వేసవిలోనే పనులు ప్రారంభమైనా..


లింకు కాలువ ద్వారా పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోని 2 లక్షల 50 వేల ఎకరాల భూములకు నీరిందించాలని నిర్ణయించారు. ఇందులో సింహ భాగం పెద్దపల్లి జిల్లాలోనే 1,84,840 ఎకరాల ఆయకట్టు ఉండడం గమనార్హం. అవసరాన్ని బట్టి అటు.. ఎస్సారెస్పీ నీటిని, ఇటు.. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వాడుకోవాలని భావించారు. 2019 వేసవి కాలంలో కాలువ నిర్మాణ పనులను మొదలు పెట్టి కొద్ది రోజుల పాటు నిలిపివేశారు. తిరిగి జూన్‌లో ఆరంభించారు. పోయిన యాసంగి సీజన్‌ నాటికే పనులు పూర్తయి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తాయని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. కానీ పనులు పూర్తి కాలేదు. 800 మీటర్ల వరకు మాత్రమే కాలువ పనులు పూర్తి చేయగా, రైతులకు భూ పరిహారం రాకపోవడంతో పనులకు ఆటంకాలు తలెత్తి మధ్యలోనే ఆగిపోయాయి. ఈ కాలువ నిర్మాణానికి కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలో 20 ఎకరాల భూమి, జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలో 56 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 3,4 ఎకరాలు మినహా మిగతా భూసేకరణ పూర్తి కావడంతో పనులు మొదలయ్యాయి. పనులు శరవేగంగా జరుగుతున్నాయని వరద కాలువ డీఈ రూప్లా ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2020-12-15T05:55:27+05:30 IST