మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2020-10-03T10:24:32+05:30 IST

గాంధీజీ ఆశయాలను సాకారం చేసేందుకు కృషిచేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ..

మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి

 రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి ‘గంగుల’

జాతిపితకు ఘన నివాళి


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 2: గాంధీజీ ఆశయాలను సాకారం చేసేందుకు కృషిచేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ,  పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను  కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. కోతిరాంపూర్‌, కలెక్టరేట్‌లోని గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, నగర మేయర్‌ వై.సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌తోపాటు పలువురు అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బాపూజీ తెచ్చిన స్వాతంత్య్ర రాజ్యంలో భూమి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషిచేయాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్‌ కె శశాంక, నగర మేయర్‌ సునీల్‌రావుతో మంత్రి గంగుల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీపీ కమలాసన్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T10:24:32+05:30 IST