మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-07-19T06:41:42+05:30 IST

నగరంలోని ప్రజలకు ప్రతిరోజు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని..

మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలి

  • - మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరంలోని ప్రజలకు ప్రతిరోజు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అర్బన్‌ ఏరియా మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై మున్సిపల్‌, వాటర్‌ గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ భగీరథ నీటి సరఫరా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఇంకా పూర్తకాని ట్యాంకులను, పైపులైన్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతిరోజు తాగునీరు సరఫరా చేయాలని, వాటర్‌ గ్రిడ్‌, మున్సిపల్‌, మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రెషర్‌ తక్కువగా ఉన్న పైపులైన్లను సరిచేయాలని సూచించారు.  ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పైపులైన్లకు ఇంటర్‌ కనెక్షన్లతోపాటు ప్రతి ఇంటికి భగీరథ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ప్రతిరోజు వాటర్‌ ట్యాంకులో నీరు నిండుగా ఉండేలా చూడాలని, ట్యాంకులను శుభ్రంగా ఉంచడంతోపాటు వాటర్‌ శాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. హ్యాండ్‌ పంపులకు రిపేర్లు లేకుండా చూసుకోవాలని, మున్సిపల్‌ అధికారులు అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. టీంలను ఏర్పాటు చేసుకొని, పైపులైన్లు లీకేజీ కాకుండా చూడాలని, మేజర్‌, మైనర్‌ రిపేర్లను ఎప్పటికప్పుడు చేయాలని అధికారులకు సూచించారు. 


స్మార్ట్‌ సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలి...

 స్మార్ట్‌ సిటీ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ పనులపై మున్సిపల్‌ అధికారులు, కార్తీక టీం, ఇంజనీరింగ్‌ అధికారులతో  ఆయన సమీక్షించారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ కె శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరు క్రాంతి, ఉప్పలయ్య, మిషన్‌ భగీరథ, వాటర్‌ గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ ఇంజనీరింగ్‌ అధికారులు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-19T06:41:42+05:30 IST