కేంద్రం నిర్ణయంతో మొక్కజొన్న రైతులకు నష్టం

ABN , First Publish Date - 2020-10-12T11:25:12+05:30 IST

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నూతన వ్యవసాయ చట్టం కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి అన్నారు.

కేంద్రం నిర్ణయంతో మొక్కజొన్న రైతులకు నష్టం

అన్నదాతకు రక్షణ లేని వ్యవసాయ చట్టం

ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి


కరీంనగర్‌ అర్బన్‌, అక్టోబరు 11 : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నూతన వ్యవసాయ చట్టం కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించటం ప్రధానమైనదని, దీనికి నూతన చట్టంలో ఏ విధమైన రక్షణ లేదన్నారు.  రైతులు పంటను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చనేది మంచిదే కానీ ఎక్కడ అమ్ముకున్నా కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర చెల్లించటం ప్రధానమైనదన్నారు. కేంద్రమే మొక్కజొన్నకు 1,850 రూపాయల మద్ధతు ధర నిర్ణయించిందని, కనీస మద్దతు ధర వర్తింపజేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయిందని, ఎకరా 20 క్వింటాళ్ల దిగుబడితో 2 కోట్ల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్న పంటకు 1,200 మించి ధర పెట్టడంలేదని, ఈ లెక్కన క్వింటాలుకు 600 వంతున రాష్ట్రంలో 1200 కోట్లు రైతులు నష్టపోతున్నారని అన్నారు. కేంద్ర అనాలోచిత నిర్ణయంతో నష్టం జరుగుతోందన్నారు. ముందుగా మొక్క జొన్నకు మద్దతు ధర కల్పించి చట్టాన్ని అమలు చేయాలన్నారు. మొక్కజొన్నకు మద్ధతు ధర కల్పించే వరకు నూతన చట్టంపై మాట్లాడే నైతికత బీజేపీ నాయకులకు లేదన్నారు.


వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి స్థానిక ఉత్పత్తులకు విఘాతం కలుగకుండా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నియంతృత్వ సాగు విధానం నెపంతో నిర్భందంగా పంటలను సాగుచేయించిందని, సన్నరకం వరికి మద్దతు ధర లేదని ఆనాడే చెప్పామని అన్నారు. సన్నరకం పంట కాలం నెలరోజులు అధికం, దిగుబడి తక్కువ, పురుగు బెడద ఎక్కువ ఉంటుందన్నారు. ఽఊరూరా దాన్యం సేకరించటం కొత్తేమీకాదని, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ముందుగా సన్నరకంపై తన ఆలోచన చెప్పాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గ్రేడ్‌ 1 దొడ్డురకం వరికి మద్దతు ధర 1,888 రూపాయలు ఇస్తున్నారని, సన్నరకాలను ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం సన్నరకానికి కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు.


సన్నరకాలపై రైతులు 10 వేలు నష్టపోతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో 5 లక్షల ఎకరాలపైగా సన్నరకాల వరి సాగు చేశారని, ఎకరాన 20 క్వింటాళ్ల వంతున 1 కోటి క్వింటాళ్ల దిగుబడి వస్తే 500 నుంచి 600 ధర తక్కువ రావటంతో 500 నుంచి 600 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. నూతన వ్యవసాయ చట్టంను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తే లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.


దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతోనే రాజ్యసభలో మాత్రమే వ్యతిరేకించారన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గడిచిన రెండు పంటల కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన కమీషన్‌ ఇప్పటికీ విడుదల చేయలేదని, దీనిపై మంత్రి గంగుల కమలాకర్‌ సమాధానం చెప్పాలన్నారు. వర్షాలతో పంటలు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికారప్రతినిధి మేడిపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, నాయకులు ఎండీ తాజ్‌, సమద్‌ నవాబ్‌, నిహాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-12T11:25:12+05:30 IST