వీధి వ్యాపారులకు రుణాలు

ABN , First Publish Date - 2020-07-19T06:34:53+05:30 IST

కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు.....

వీధి వ్యాపారులకు రుణాలు

  • ఐదు మున్సిపాలిటీల్లో అర్హులైన వారి ఎంపిక
  • ష్యూరిటీ లేకుండానే రూ.10 వేల రుణం
  • ఇప్పటికే 200 మందికి లబ్ధి

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. పట్టణ ప్రాంతాల్లోని వీధుల్లో చిరు వ్యాపారం చేసుకుంటున్నవారికి ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ.10 వేల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.


ప్రణాళిక రూపొందిస్తున్న బ్యాంక్‌ అధికారులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్‌ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లోని 10 వేల మందికి ఈ నెలాఖరులోగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించి, అర్హులైనవారికి రుణాలు ఇస్తున్నారు. ఈ ఐదు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారం చేసుకునేవారు ఇప్పటికే దాదాపు 200 మంది జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్నారు. వీధి వ్యాపారం చేసుకునేవారు ఆయా మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకుని వీధి వ్యాపారం చేస్తున్నట్లు లైసెన్స్‌ పొందాలి. ఆ లైసెన్స్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారు సూచించిన బ్యాంక్‌ నుంచి రుణం మంజూరైనట్లు సమాచారం వస్తుంది. దానిని తీసుకుని మెప్మా అధికారులను కలిస్తే  వారు బ్యాంక్‌కు వెంట తీసుకువెళ్లి రూ.10 వేల రుణం ఇప్పిస్తారు. రూపాయి ఖర్చు లేకుండా రూ.10 వేల రుణం పొందే అవకాశం ఉంది.  


వ్యాపారులకు అనుకూలంగా రుణం

వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం 7 శాతం వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఒక్కో బ్యాంక్‌లో వడ్డీ రూ.9 నుంచి రూ.14 వరకు ఉంది. అయితే రుణం తీసుకున్న వ్యాపారులు రుణం చెల్లింపు పూర్తి కాగానే 7 శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లించి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. చాలా బ్యాంకుల్లో 9 శాతం మేరకే వడ్డీ ఉండగా, రెండు, మూడు బ్యాంకుల్లో మాత్రమే రూ.10 నుంచి రూ.14 వరకు వడ్డీ ఉంది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం రూ.10 వేల రుణం తీసుకున్నట్లయితే 7 శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా వడ్డీని రుణం తీసుకున్న వారు చెల్లించాల్సి ఉంటుంది.  


దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు 

గౌతం లక్ష్మీనారాయణ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, జగిత్యాల

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారం చేస్తున్న వారందరికీ రుణాలు ఇస్తాం. వీధి వ్యాపారులు ఆయా మున్సిపాలిటీల నుంచి లైసెన్స్‌ తీసుకుని రుణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే రూ.10 వేలు రుణం ఎటువంటి షరతులు లేకుండా మంజూరు చేస్తాం.

Updated Date - 2020-07-19T06:34:53+05:30 IST