ప్రభుత్వ ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు
ABN , First Publish Date - 2020-10-04T10:03:17+05:30 IST
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ. 85 లక్షలతో లిక్విడ్ ఆక్సీజన్ ప్లాంటు
ఆక్సీజన్ కొరతకు శాశ్వత పరిష్కారం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
సుభాష్‌నగర్, అక్టోబరు 3: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ. 85 లక్షలతో లిక్విడ్ ఆక్సీజన్ ప్లాంటు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సీజన్ ప్లాంట్‌ను కలెక్టర్ కె శశాంక, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర మేయర్ వై సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లభిస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగేలా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్లు తీసుకురావడం వలన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా డెలివరీలు జరుగుతున్నాయన్నారు.
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కలిగిన వారు నిర్లక్ష్యం చేయకుండా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితోపాటు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని మంత్రి అన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 400 పడకలకు నేరుగా ఆక్సీజన్ సరఫరా జరుగుతుందని అన్నా రు. 21 వేల లీరట్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆక్సిజన్ కొరత ఉండదని మంత్రి తెలిపారు. ఒకేరోజు 2,630 మంత్రి పేషెంట్లకు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చినా వీటి ద్వారా పెట్టవచ్చని, రాబోయే 20 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహకారంతో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ తర్వాత లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ కరీంనగర్ ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో కరోనా రికవరీ రేటు 98 నుంచి 99 శాతం వరకు ఉందని తెలిపారు. ఒక పర్సంట్ ఇతర వ్యాధులు ఉండడం వలన కోవిడ్ తీవ్రత ఎక్కువగా పెరిగి చనిపోవడం జరిగిందని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రజల్లో కూడా కరోనాపై అవగాహణ పెరిగి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, సానిటైజేషన్ చేస్తూ సామాజిక దూరం పాటించడం వలన జిల్లాలో కరోనాను తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతోందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లి డబ్బులు వృథా చేయకూడదని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాలని అన్నారు. కరోనా నేపథ్యంలో జిల్లా ప్రజలకు వైద్య సేవల్లో ఎటువంటి అసౌకర్యం కలుగరాదనే ఉద్దేశ్యంతో, ఆక్సీజన్ సిలిండర్ల సరఫరా ఇబ్బందులను గమనించి శాశ్వతంగా లిక్విడ్ ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, అడ్మినిస్ర్టేటర్ ఎంపీసీ డాక్టర్ అలీం, ఆర్‌ఎంవో శౌరయ్య, భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ డిస్ర్టిబ్యూటర్ తదితరులు పాల్గొన్నారు.