పసుపు బోర్డు హామీ నెరవేర్చని ఎంపీ రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2020-02-08T12:02:16+05:30 IST
ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ..

జగిత్యాలకు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 7: ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైతాంగం విషయంలో నిజామాబాద్ ఎంపీ అర్విం ద్ ఏ విధంగా చర్యలు తీసుకోకుండా, జగిత్యాల నియోజకవర్గంలో ఒక్కసారి కూడా పర్యటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతుల ఓట్లతో గెలిచిన ఎంపీ ఇప్పుడు సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేశాడని ఆరోపించారు. సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఏం లాభం చేకూరుతుందో వివరించాలని అన్నారు. ముఖ్యమంత్రి కూతురైన కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు ఆమెపై ఉన్న అసంతృప్తితో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు బీజేపీ ఎంపీగా అర్వింద్‌ను గెలిపించారని పేర్కొన్నారు.
గెలిచి సంవత్సర కాలం అయినప్పటికీ ఏ ఒక్క రూ పాయి నిధులైనా ఈ ప్రాంతానికి తీసుకువచ్చారా, ఏమైనా అభివృద్ధి చేశారా అనే విషయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్‌కు నిరుపేద వర్గాల బాధ తెలుసా అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే తక్షణమే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, అప్పుడు రైతుల దమ్ము ఏమిటో తెలుస్తుందన్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలను బీజేపీ ఇరుకున పెడుతోందని, దీనికి ఉదాహరణే ఎన్‌ఆర్‌సీ అని వివరించారు. టీఆ ర్‌ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏనాడైనా గల్ఫ్ బాధితుల సమస్యలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తక్షణమే జగిత్యాల జిలా ్లలో ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని అర్వింద్‌కు సవాల్ విసిరారు. లేని పక్షంలో జగిత్యాల జిల్లాలో అర్వింద్ పర్యటిస్తే అడ్డుకుంటామని, అవసరమైతే ఆయన ఇంటిని డప్పు చప్పుళ్లతో ముట్టడిస్తామని, కేసులకు భయపడమని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, మాజీ బల్దియా చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు కొత్త మోహన్, గుంటి జగదీశ్వర్, ముస్కు దామోదర్‌రెడ్డి, పుప్పాల అశోక్, చిట్ల అంజ న్న, సిరాజోద్దీన్ మన్సూర్, నక్క జీవన్, రియాజ్, లింగంపేట మహేందర్, గుండ మధు తదితరులు పాల్గొన్నారు.