ప్రహసనంగా భూ పంపిణీ

ABN , First Publish Date - 2020-12-15T05:59:48+05:30 IST

నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ముచ్చటగానే మిగిలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5.52 లక్షల జనాభాలో 1.39 లక్షల దళిత జనాభా ఉంది. ఇందులో ఎక్కువ శాతం భూములు లేని నిరుపేదలే ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 165 మంది లబ్ధిదారులకు 436 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు.

ప్రహసనంగా  భూ పంపిణీ

- ముందుకు సాగని దళితులకు మూడెకరాలు 

- ఇప్పటి వరకు 165 మంది లబ్ధిదారులకు 436 ఎకరాలు 

- జిల్లాలో ఎదురు చూస్తున్న పేద దళితులు 

   (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ముచ్చటగానే మిగిలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5.52 లక్షల జనాభాలో 1.39 లక్షల దళిత జనాభా ఉంది. ఇందులో ఎక్కువ శాతం భూములు లేని నిరుపేదలే ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 165 మంది లబ్ధిదారులకు 436 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. అనేక మంది దళితులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. భూమి కొనుగోలుకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, పట్టా భూములు అధిక ధరలు ఉండడంతో దళితుల మూడెకరాల భూ పంపిణీ ప్రహసనంగా మారింది.  దళితులకు మూడెకరాల భూమి పంపిణీని టీఆర్‌ఎస్‌ ప్రధానాంశంగా చేర్చుకుంది. 2014లో నిరుపేద దళితులకు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టినా ఇంతవరకు నామమాత్రంగానే పథకం ముందుకు సాగుతోంది. భూములు లేని నిరుపేద దళితులు కుటుంబాలను వదిలి ఉపాధి కోసం గల్ఫ్‌  దేశాలకు వలస వెళ్తున్నారు. జిల్లాలో సమృద్ధిగా నీటి వనరులు ఉండి వ్యవసాయం పెరుగుతున్నా భూములు లేక వేలాది మంది దళితులు భూముల కోసం ఎదురు చూడక తప్పడం లేదు. భూ పథకంలో అర్హులైన దళితులకు ఎకరం ఉంటే రెండెకరాలు, రెండెకరాలు ఉన్న వారికి మరో ఎకరం అందిస్తారు. ఇందుకోసం అదనపు కలెక్టర్‌, ఆర్డీవో,  తహసీల్దార్‌, ఎస్సీ కార్పొరేషన్‌, దళిత సంఘాల నాయకుల కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.  


15 గ్రామాల్లోనే భూ పంపిణీ

 జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా 15 గ్రామ పంచాయతీల పరిధిలోనే దళితులకు భూ పంపిణీ జరిగింది. 2014-15లో 34 మందికి 87.34 ఎకరాలు పంపిణీ చేశారు. అందులో ఇల్లంతకుంట మండలంలో జవారిపేటలో 25 మందికి 62.09 ఎకరాలు, ముస్తాబాద్‌ మండలం మోయినికుంటలో ఐదుగురికి 13.25 ఎకరాలు, వేములవాడ మండలం చెక్కపల్లిలో నలుగురికి 12 ఎకరాలు పంపిణీ చేశారు. 2015-16లో 51 మంది లబ్ధిదారులకు 142.075 ఎకరాలు పంపిణీ చేశారు. ఆ సంవత్సరం ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో 17 మందికి 48.14 ఎకరాలు, వంతడ్పులలో ఐదుగురికి 13.28 ఎకరాలు, రేపాకలో ముగ్గురికి 8 ఎకరాలు, కోనరావుపేట మండలం కనగర్తిలో 17 మందికి 45.18 ఎకరాలు, ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌లో 9 మందికి 26.275 ఎకరాలు పంపిణీ చేశారు. 2017-18లో 57 మంది లబ్ధిదారులకు 145.305 ఎకరాలు పంపిణీ చేయగా  కోనరావుపేట మండలం ధర్మారంలో 36 మందికి 95.36 ఎకరాలు, ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో 9 మందికి 19.005 ఎకరాలు, ముస్తాబాద్‌ మండలం మోయినికుంటలో 12 మందికి 30.34 ఎకరాలు పంపిణీ చేశారు. 2018-2019లో 23 మంది లబ్ధిదారులకు 60.10 ఎకరాలు పంపిణీ చేశారు. ఇందులో ఎల్లారెడ్డిపేట మండలంలో సింగారంలో 5 గురికి 13.28 ఎకరాలు, దుమాలలో ముగ్గురికి 6.30 ఎకరాలు, ముస్తాబాద్‌ మండలంలో నామాపూర్‌లో ఇద్దరికి 5.26 ఎకరాలు, మద్దికుంటలో 13 మందికి 33.46 ఎకరాలు పంపిణీ చేశారు. కేవలం కొన్ని గ్రామాల్లో కొద్ది మందికే భూములు అందించడంతో ఈ పథకం నీరుగారిపోయింది. భూ పంపిణీ నేరవేరని హామీగానే మిగిలింది. 

Updated Date - 2020-12-15T05:59:48+05:30 IST