కరోనా పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి
ABN , First Publish Date - 2020-10-08T10:03:05+05:30 IST
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంలో కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నగర మేయర్ వై సునీల్‌రావు తెలిపారు.

పండగల వేళ అప్రమత్తంగా ఉండాలి
మేయర్ సునీల్‌రావు
కరీంనగర్ టౌన్, అక్టోబరు 7: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంలో కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నగర మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. బుధవారం నగరంలోని 11వ డివిజన్ గౌతమినగర్‌లో కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సయ్యతో కలిసి పర్యటించారు. గౌతమినగర్‌లో కరోనా పరీక్షల వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాలనీల్లో పర్యటించి డ్రైనేజీలు, మట్టిరోడ్లును పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేరళలో ఓనమ్ పండుగ సందర్భంలో బయటకు వచ్చి ఉత్సవాలు జరుపడంతో చాలామంది కరోనా బారినపడ్డారని, నగర ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. 30 లక్షలకుపైగా కరోనా వైరస్ పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన రోగులకు హోమ్ ఐసోలేషన్‌తోపాటు హాస్పిటల్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన వైద్యం అందించిందన్నారు. ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే కోవిడ్ మరణాలరేటు రాష్ట్రంలో చాలా తక్కువ అని అన్నారు. కరోనా బారినపడ్డ ప్రజలు రికవరీ అయ్యారని, ప్రస్తుతం రాష్ట్రం లో ఆక్టివ్ కేసులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. పండుగ సందర్భంలో ప్రభుత్వం, వైద్యులు ఇచ్చిన సూచనలను పాటించి పండగును జరుపుకోవాలని తెలిపారు. మాస్కులు, సానిటైజర్లను వాడాలని సూచించారు.
మన రాష్ట్రంలో కేరళ లాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. కోవిడ్ పరీక్షల శిబిరాలను నగర ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ శశాంక సూచనల మేరకు వైద్య సిబ్బంది నగరవ్యాప్తంగా కోవిడ్ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 15 డివిజన్లలో క్యాంపు నిర్వహించామని, మిగతా డివిజన్లలో కూడా నిర్వహిస్తామని తెలిపారు. 11వ డివిజన్ ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు.