-
-
Home » Telangana » Karimnagar » knr
-
అలసత్వమే... అసలు వ్యాధి
ABN , First Publish Date - 2020-03-13T11:55:55+05:30 IST
అలసత్వమే... అసలు వ్యాధి

- ప్రారంభానికి నోచుకోని డయాగ్నోస్టిక్ సెంటర్
- మందుబాబులకు అడ్డాగా మారిన భవనం
- రూ. 38లక్షల నిధులు వృథా
- వైద్య పరీక్షల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న పేదలు
(ఆంధ్రజ్యోతి, జగిత్యాల):
పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ వృథాగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలనే ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. జగిత్యాలలో రూ.38 లక్షలతో అన్ని సౌకర్యాలతో భవనం నిర్మించారు. భవనం నిర్మించి ఎనిమిది మాసాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఇది మందుబాబులకు అడ్డాగా మారింది. పేద ప్రజలకు ఆర్థిక భారం పడకుండా వైద్య పరీక్షలన్నీ ఒకే చోట చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అధికారులు పట్టించుకోక పోవడంతో జగిత్యాల జిల్లాలో ప్రారంభానికి నోచుకోవడం లేదు.
రూ.38 లక్షలతో డయాగ్నోస్టిక్ సెంటర్
వైద్య పరీక్షలు నిర్వహించడానికి జగిత్యాలలో రూ.38 లక్షలతో డయాగ్నోస్టిక్ సెంటర్ భవనం నిర్మించారు. జిల్లాలోని 18 మండలాల పీహెచ్‌సీలు, ప్రధాన వైద్యశాల నుంచి వ్యాధిగ్రస్తుల శాంపిల్స్ తెప్పించి ఇక్కడ పరీక్షలు నిర్వహించాలి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూవంటి సీజనల్ వ్యాధులతో పాటు వీడీఆర్‌ఎల్, హెమటాలజీ, బ్లడ్ గ్రూపింగ్, ప్లేట్‌లెట్స్, హార్మోన్ స్టడీస్, మేజర్, మైనర్ సర్జికల్ ప్రొఫైల్, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఐజీ, హెచ్‌సీవీ, విటమిన్ బి-12, డి-విటమిన్, షుగర్, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, థైరాయిడ్, ఫీవర్, టీబీ, క్యాల్షియం వంటి అనేక పరీక్షలు నిర్వహిస్తారు.
మందుబాబులకు అడ్డాగా భవనం
డయాగ్నోస్టిక్ హబ్ మందుబాబులకు అడ్డాగా మారింది. టీఎస్ ఎంఎస్‌ఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఈ భవనం నిర్మించారు. పూర్తయి ఎనిమిది మాసాలవుతున్నా ప్రారంభం కాకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటోంది. కొందరు అక్కడే మందు తాగి సీసాలు పడవేస్తుండగా, కిటికీలు ఊడిపోయి, అద్దాలు పగిలిపోయాయి. టీఎస్‌ఎంస్ ఐడీసీ వారు జగిత్యాల ప్రధాన వైద్యశాలకు భవనం అప్పగించారు. వారు సంబంధిత పరికరాల కోసం ప్రభుత్వానికి లేఖలు పంపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు పరికరాలు మంజూరు కాకపోగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనం ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయింది. ఇటీవల స్వైన్‌ఫ్లూ, డెంగ్యూతో పాటు ప్రస్తుతం కరోనా వ్యాధి రావడంతో ప్రజలు పరీక్షల నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభమైతే వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.
సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తాం- పి.శ్రీధర్, జిల్లా వైద్యాధికారి, జగిత్యాల
డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తాం. ఆ భవనం టీఎస్ ఎంఎస్‌ఐడీసీ వారు నిర్మించారు. ఎవరికి అప్పగించారో తెలియదు. సంబంధిత అధికారులతో మాట్లాడుతాం. త్వరితగతిన ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తాం.